Tuberculosis Prevention Day: క్షయ వ్యాధి నివారణకు సంబంధించి 8 జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మరోసారి తన సత్తాను చాటింది. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన ప్రపంచ క్షయ నివారణ సదస్సు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. అధికారులకు ఈ అవార్డులను అందజేశారు. దేశంలోని రాష్ట్రాలు, జిల్లాలను క్షయ రహితంగా తీర్చి దిద్దటంలో అధికారులు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు.
దేశవ్యాప్తంగా 337 జిల్లాలో అమలు జరిగిన ఈ కార్యక్రమంలో 18 జిల్లాలు స్వర్ణ పతకాలను, 28 జిల్లాలు రజిత పతకాలను, 65 జిల్లాలు కాంశ్య పతకాలను సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏలూరు జిల్లా స్వర్ణ పురస్కారాన్ని దక్కించుకోగా, విశాఖ పట్నం, కోనసీమ జిల్లాలు రజిత పురస్కారాలను.. శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు.. కాంశ్య పతకాలను అందుకున్నాయి. 2015-2022 మధ్య కాలంలో క్షయ వ్యాధి నివారణకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం చేసిన పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డులను అందచేశారు.
కేంద్ర క్షయ నివారణ విభాగం, చెన్నైలోని క్షయ వ్యాధి జాతీయ పరిశోధనా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ నేషనల్ సర్టిఫికేషన్‌ని మూడు పద్ధతుల్లో అమలు చేశారు. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో 2,49,208 ఇళ్లకు చెందిన 6,30,474 మంది వ్యక్తులను పరిక్షించారు. వారిలో క్షయ వ్యాధి నిర్ధారణకు గాను 7,249 మంది కళ్లె పరీక్ష నిర్వహించగా 127 మందికి క్షయ వ్యాధి లక్షణాలున్నట్లు గుర్తించారు.
ఈ సమాచారాన్ని నిక్షయ్ డేటాబేస్‌లోని సమాచారంతోనూ, మందుల అమ్మకాల సమాచారంతోనూ పరిశీలించారు. జిల్లా స్థాయిలో ఆయా వైద్య కళాశాలల ఫ్యాకల్టీ సభ్యులు ఈ సమాచారాన్ని పరిశీలించి నివేదిక అందచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022లో 92,177 కేసులను కొత్తగా గుర్తించారు. ప్రస్తుతం 19,987 మంది చికిత్సను అందుకుంటున్నారు. అనుమానితులను పరీక్షించి వారికి ఆయా వ్యాధులకు సంబంధించిన రెగ్యులర్ చికిత్సను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చదవండి:
- ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు.. ఈ ప్రభుత్వం భవిష్యత్ మనుగడ ప్రశ్నార్ధకమే
- మరో పరువు హత్య.. లవర్‌తో పరారైనందుకు కూతురు మర్డర్.. కరెంట్ షాక్ అని చెప్పి..
- 'భగవంతుడి పాత్ర కంప్లీట్.. భక్తుడిదే బ్యాలెన్స్!'.. పవన్ నయా మూవీ క్రేజీ అప్డేట్
- కీర్తి సురేశ్‌కు 'దసరా' డైరెక్టర్ 12 కిలోలు తగ్గమన్నారట.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా?