YSRCP Leader Warn To MPDO: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్ విజయకు నల్లచెరువు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు తాతాజీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జడ్పీటీసీకి ప్రోటోకాల్ పాటించటం లేదని...,తాము చెప్పినట్లు వినకపోతే చీరేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
దీనిపై స్పందించిన ఎంపీడీవో విజయ..కే. జగన్నాథపురంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు వాలంటీర్లను తప్పించానన్నారు. వాలంటీర్లను తప్పించటతో పాటు జడ్పీటీసీ సభ్యుడికి ప్రోటోకాల్ పాటించలేదని నా మీద ఆరోపణలు చేస్తున్నారని ఆమె వాపోయారు. తనను హెచ్చరించిన తాతాజీతో పాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆర్టీవో వసంతరాయుడు, పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.
ఎంపీడీవో విజయ పట్ల వైకాపా నాయకుడు దురుసు ప్రవర్తనను ఖండిస్తూ..రేపు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎంపీడీవోలు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని జిల్లా సంఘం పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి : 'ఓటీఎస్' డబ్బు చెల్లించకుంటే పథకాలు కట్.. ఎంపీడీవో ఆడియో వైరల్!