పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆ పార్టీ రెబెల్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను.. ఉపసంహరించుకోవాలని వైకాపా రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. వైకాపా మద్ధతుదారుల విజయానికి పాటుపడాలని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా అనేక పథకాలను అమలు చేస్తూ.. ప్రజల మన్ననలను పొందుతుందని అన్నారు. మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
అనపర్తి మండలంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా.. వైకాపా మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి రెబల్ అభ్యర్థులను రంగంలో నిలిపినట్లు తమ దృష్టికి వచ్చిందని మోషేన్‌రాజు అన్నారు. ఈ తరహా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని చెప్పారు. పార్టీలో కొనసాగాలంటే రెబల్ అభ్యర్ధులతో నామినేషన్ తీయించి స్థానిక శాసన సభ్యులను కలసి.. తమ తప్పును ఒప్పుకోవాలన్నారు. ఆదినారాయణ రెడ్డికి ఇది తుది అవకాశమని మోషేన్ రాజు హెచ్చరించారు. లేనిపక్షంలో పార్టీ కఠిన నిర్ణయం తీసుకుని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వైకాపా నాయకులు ఉన్నారు.