YSRCP Government Neglects National Highway Works: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన జాతీయ రహదారుల ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలి. సీఎం జగన్ తొలిసారిగా రహదారులపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా 2019, నవంబరు 4న అధికారులకు ఇచ్చిన ఆదేశాలివి. కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి సంబంధించి పలుచోట్ల పనులు పూర్తికావాల్సి ఉందని అదే సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమీక్ష జరిగి ఇప్పటికి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అప్పటికే ఈ ప్రాజెక్టులో సగానికిపైగా పనులను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టింది. మిగిలిన భాగంలో అడ్డంకిగా ఉన్న భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చకాచకా పూర్తిచేసి మోర్త్‌కు అప్పగించి ఉంటే పూర్తయ్యేది. కానీ వివిధ జిల్లాల్లో భూసేకరణలో వైసీపీ సర్కారు విఫలమవుతోంది. కోస్తాలో తీర ప్రాంత జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి- ఒంగోలు జాతీయ రహదారి-216ని పూర్తి చేసేందుకు కేంద్ర సంస్థ నిధులతో సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించడం లేదు.
YCP government has not completed land acquisition for four years: భూసేకరణ సమస్య కారణంగా ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ జాతీయ రహదారి పనుల్లో ఇంకా 29.82 కిలోమీటర్ల పనులు కొనసాగుతునే ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి నుంచి కాకినాడ, అమలాపురం, రాజోలు, నర్సాపురం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, బాపట్ల, చీరాల మీదుగా ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు 3,800 కోట్లను 2015-16లోనే కేంద్రం మంజూరు చేసింది. కోల్‌కతా-చెన్నై జాతీయ ప్రత్యామ్నాయంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రజా, సరకు రవాణాకు ఇది ఎంతో కీలకమైనది. 2016-17లో రహదారి నిర్మాణ పనులు ప్రారంభంకాగా 2019 నాటికి 200 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 2,900 కోట్లు ఖర్చు చేసి 350 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేయగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దాదాపు 30 కిలోమీటర్ల మేర పనులు సాగడం లేదు.
Kathipudi-Ongolu National Highway works progressing slowly: పెండింగ్ పనుల పూర్తికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. పాసర్లపూడి నుంచి దిండి వరకు 20.82 కిలో మీటర్ల ప్యాకేజీలో 4.69 కిలో మీటర్ల పనులు ఆగిపోయాయి. ఇందులో రాజోలు బైపాస్‌కు సంబంధించి 3 కిలో మీటర్లు మేర భూసేకరణ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం సరిపోదంటూ భూయజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేపల్లె నుంచి ఈపురుపాలెం మధ్య ఉన్న 62.12 కిలో మీటర్లు ప్యాకేజీలో రేపల్లె, భట్టిప్రోలు, బాపట్ల పరిధిలో 6.2 కిలో మీటర్ల మేర పనులు పూర్తికాలేదు. ఇందులో కూడా 3 కిలో మీటర్లకు భూసేకరణే అవరోధంగా మారింది.
బాపట్లలో 6.9 కిలో మీటర్ల మేర నాలుగు వరుసల రహదారి మాత్రం గత ఏడాది మంజూరు చేశారు. భూసేకరణలో భాగంగా పురపాలక అధికారులు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. పరిహారం సరిపోదంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ బైపాస్‌లో భాగంగా తిమ్మాపురం నుంచి గురజానపల్లి వరకు 19.22 కిలోమీటర్లు. పనుల్లో ఇంకా 0.58 కిలోమీటర్ల పనులు ఆగిపోయాయి. ఇందులో కొంత భూసేకరణతో పాటు రెండు చోట్ల ఆర్వోబీల నిర్మాణంపై సమస్య తలెత్తింది.
Farmers Agitation: పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన
Kathipudi-Ongolu National Highway accessible at some places..
- కత్తిపూడి నుంచి కాకినాడ బైపాస్‌లో తిమ్మాపురం వరకు 26.15 కిలోమీటర్లు, తిమ్మాపురం నుంచి గురజానపల్లి వరకు 18.64 కిలోమీటర్లు అందుబాటులో వచ్చింది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.
- గురజానపల్లి నుంచి పాలెకుర్రు వరకు 15.37 కిలోమీటర్లు, పాలెకుర్రు నుంచి కోమగిరి వరకు 10.62 కిలోమీటర్లు , కోమగిరి నుంచి పాసర్లపూడి వరకు 35 కిలోమీటర్లు మార్గం సైతం పూర్తవ్వడంతో వాహనరాకపోకలు సాగిస్తున్నాయి.
- పాసర్లపూడి నుంచి దిండి వరకు 16.13 కిలోమీటర్లు, దిండి నుంచి దిగమర్రు మీదగా లోసరి వరకు 42.12 కిలోమీటర్లు రహదారి కూడా రాకపోకలకు అనువుగా ఉంది.
- లోసరి నుంచి మచిలీపట్నం బైపాస్ సమీపంలోని మాచవరం వరకు 49.4 కిలోమీటర్లు, మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వరకు 34.4 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది.
- కృష్ణానదిపై ఉన్న పులిగడ్డ వంతెన దాటాక రేపల్లె నుంచి ఈపురుపాలెం మధ్య 55.92 కిలోమీటర్లు, ఈపురుపాలెం నుంచి ఒంగోలు వరకు 57.87 కిలోమీటర్లు వాహనదారుల రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది.