YCP ACTIVISTS: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొందని పలువురు వైకాపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో సోమవారం పిఠాపురం నియోజకవర్గ వైకాపా ప్లీనరీ నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, కార్యకర్తలను దూరంగా పెట్టడంతో కనీస గుర్తింపు లేదనే అభిప్రాయం ఉందని జడ్పీ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు, జడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగలోవరాజు పేర్కొన్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలను పూర్తిగా విస్మరించడం శోచనీయమని పిఠాపురం ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ కమిటీలు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారని, వాలంటీర్లతోనే కమిటీలు వేసుకోండని కార్యకర్తలు సలహా ఇస్తున్నారని అన్నారు. వచ్చే రెండేళ్లలో వాలంటీర్లను పక్కనబెట్టి కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. దీనిపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పందిస్తూ.. కష్టాల్లో ఉన్నామని కార్యకర్తలు చెప్పడం లేదని, పదవులు పొందిన వారే చెబుతుండటం సరికాదన్నారు. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సైన్యంలా కష్టపడి పనిచేసేవారే వైకాపా కార్యకర్తలన్నారు. గ్రామాల్లో పెత్తనంలేక కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని, వారి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తే నిందలు వచ్చేవన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ నేరుగా పథకాలు అందుతున్నాయని చెప్పారు. లోపాలుంటే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కార్యకర్తల ఆవేదనను పరిశీలనలోకి తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి: