Untimely Rains Damaged Crops: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం కురిసిన వర్షాలకు.. తూర్పు, మధ్య డెల్టా ప్రాంతంలో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. మంచి దిగుబడులు వచ్చాయన్న ఆనందాన్ని.. అకాలవర్షాలు రైతుకు లేకుండా చేశాయి . తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, అనపర్తి, రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గాల్లో కురిసిన వర్షాలకు.. ఆరబెట్టిన ధాన్యంతోపాటు కల్లాల్లోని వరి పంట తడిసిపోయింది.
కొన్ని చోట్ల చేతికొచ్చిన పంట నేలకొరిగింది. కోతలు పూర్తయినా ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, సంచుల కొరత, రోజుకో నిబంధన వంటి కారణాలతో.. రైతులు పొలం గట్లు, రహదారులు, పొలాల్లో ధాన్యాన్ని నిల్వచేశారు. ఇప్పుడు అకాల వర్షాల కారణంగా తడిసి పాడైపోయిన ధాన్యాన్ని చూసి.. తల్లడిల్లిపోతున్నారు.
కోనసీమ జిల్లాలో దాదాపు 3 వేల ఎకరాల్లో కోతకు వచ్చిన పంట నేలవాలినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కాకినాడ జిల్లాలోని 9 మండలాల పరిధిలో వరి పంటకు ఎక్కువ నష్టం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 200 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ.. సంచుల కొరత, ధాన్యం తరలింపులో ఆలస్యం కారణంగా.. రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు.. తడిసిముద్దయ్యాయి. జిల్లాలో ఇప్పటికే సగానికి పైగా వరి కోతలు పూర్తికాగా.. కల్లాలు, రోడ్లపై ధాన్యం రాశుల్ని పోసి.. సంచుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
కోతలు పూర్తై 2-3 వారాలు కావస్తున్నా.. రైతులకు సకాలంలో సంచులు అందని పరిస్థితి ఉంది. లారీల కొరతా రైతుల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఖరీఫ్ నాటి బకాయిల్ని నేటికీ చెల్లించకపోవడంతో యజమానులు.. లారీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. ధాన్యం రవాణా చేసే వీలు లేక రైతులు.. రోడ్లపైనే రోజుల తరబడి ధాన్యం బస్తాలతో ఎదురుచూస్తున్నారు. ముందు జాగ్రత్తగా ధాన్యం రాశులు, బస్తాలపై బరకాలు కప్పి ఉంచినా.. భారీ వర్షం కారణంగా తడిసిముద్దయ్యాయి.
సకాలంలో ఆర్బీకేలు, ఐకేపీ కేంద్రాలు తెరిచి.. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి ఉంటే.. ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు అంటున్నారు. సంచులన్నీ.. రాత్రికి రాత్రే.. అధికార పార్టీ కార్యకర్తలు, అనుచరులకు చేరుతున్నాయని.. రైతులకు మాత్రం రిక్తహస్తమే చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సంచులు అందించి.. కొర్రీలు పెట్టకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తేకానీ తాము ఊపిరి పీల్చుకునే అవకాశం లేదని రైతులు తేల్చిచెబుతున్నారు.
"నాలుగు ఎకరాలకి ఇంచుమించు లక్షా ఏభై వేలు ఖర్చు అయింది. ప్రభుత్వం సహకారం అందించి.. ఈ తడి ధాన్యాన్ని కొనేలా చూస్తే ఊపిరి పీల్చుకొని ఒక్క పూట అయినా తినగలం. లేదంటే ఉరివేసుకొని చనిపోవడం తప్ప ఈ రైతు అనే వాడికి ఏ సుఖం లేదు". - రైతు
"12 రోజులుగా ఎక్కడ ధాన్యం అక్కడే ఉన్నాయి. ఈ 12 రోజులలో ఒక్క సంచి కూడా ఇవ్వలేదు. మా వైపు ఒక్కరు కూడా చూడటం లేదు. మమ్మల్ని ఏడిపించి చంపుతున్నారు". - రైతు
ఇవీ చదవండి: