పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంతో పాటు మండలంలోని 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వరదల సమయంలో ఏటా ముంపు తీవ్రత పెరగడంతో వీరికి ఇప్పటికే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించి పునరావాసం కల్పించాల్సి ఉంది. కాని నేటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. గిరిజన నిర్వాసితులు దేవీపట్నం, గంగవరం మండలాల్లో 1658 ఇళ్లు, గిరిజనేతల నిర్వాసితులకు గోకవరం మండలం కృష్ణుడిపాలెంలో 1067 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వరదలకు ముందే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు అందించి, కాలనీ నిర్మాణాలు పూర్తిచేసి తరలిస్తామని వరద ముందు పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. కాని ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో నిర్వాసితుల తరలింపు జరగలేదు.
అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సారి వరద ముంచెత్తడంతో నిర్వాసితులు నరకయాతన అనుభవించారు. కరోనా భయంతో కనీసం బంధువుల ఇళ్లకైనా వెళ్లేందుకు వీలులేక చాలా మంది కొండలపై బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాగా మరికొందరు గోకవరం, కోరకొండ, రంపచోడవరం తరలివచ్చారు. తలకుమించిన భారమైనప్పటికీ ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. రూ.4వేల నుంచి 8వేల వరకూ అద్దెలు చెల్లిస్తున్నారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే ఉపాధి కరవైన వీరికి ఇళ్ల అద్దెలు, కుటుంబ పోషణ మరింత భారంగా మారింది. తాము ఎన్నడూ చూడని విధంగా ఈసారి తమ గ్రామాలను వరద ముంచెత్తిందని నిర్వాసితులు వాపోతున్నారు.
ఈ ఉధృతితో చాలామంది సామగ్రితోపాటు సుమారు 500 ఇళ్లు కొట్టుకుపోయాయని చెబుతున్నారు. వరద అనంతరం బురదతో నిండిన ఇళ్లను శుభ్రం చేసుకోవడానికే సుమారు 8వేల వరకూ ఖర్చయిందని అంటున్నారు. సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ అర్హత ఉన్నా లంచం అడుగుతున్నారని కొందరు వాపోతున్నారు. అధికారులు అందించే 20కిలోల బియ్యం కోసం గోకవరం నుంచి రంపచోడవరం మీదుగా దేవీపట్నం వెళ్లడానికి 120కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఓ మహిళా వాపోయింది. సాధ్యమైనంత తొందరగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించి ఇళ్ల నిర్మాణం చేపడితే వెళ్లిపోతామని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ... మూడు శతాబ్దాలుగా ఆ గ్రామంలో మద్యపాన నిషేధం