కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలోని తన స్వగృహంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు నిరసన చేపట్టారు. ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత వల్ల కరోనా బాధితులు, మృతుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందన్నారు. తాడేపల్లి ప్యాలస్కు పరిమితమైన ముఖ్యమంత్రికి.. ప్రాణాలు కాపాడమంటూ బాధితులు చేస్తున్న ఆర్తనాదాలు వినబడటం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆక్సిజన్, పడకల కొరతతో కరోనా బాధితులు అల్లాడుతున్నారని, ఆక్సిజన్ ఇవ్వలేని వారికి అధికారం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. తాయిలాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, టీకాలు మీద ముందు శ్రద్ధ పెట్టాలని సూచించారు.
కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే దీక్ష
కొవిడ్ వ్యాక్సిన్ ప్రజలందరికీ వేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కమలాపురంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆనంద రావు దీక్ష చేపట్టారు. ప్రాణవాయువు అందక ప్రజల చనిపోతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కరోనాతో ఆ గ్రామంలో మృత్యుఘోష.. పరిష్కరించాలని మంత్రి ఆదేశం