తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై అలకబూనిన రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరిని..బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బుచ్చయ్య అసంతృప్తికి కారణాలు తెలుసుకునేందుకు..ఆ పార్టీ అదిష్టానం త్రిసభ్య కమిటీని నియమించింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్. జవహర్‌లు..శుక్రవారం సాయంత్రం బుచ్చయ్యచౌదరి నివాసానికి వెళ్లి..సుమారు రెండున్నర గంటల పాటు ఆయనతో అంతర్గతంగా చర్చలు జరిపారు. ఆయన అభిప్రాయాలు, మనోభావాలు తెలుసుకున్నారు.
ఉద్యోగులు పార్టీని నడిపించే పరిస్థితి వస్తే రాజకీయాలు ఎలా చేస్తామని..నేతల ముందు బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీని నమ్ముకున్న వారిని కాదని, బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే..గత ఎన్నికల్లో తెలుగుదేశం తీవ్రంగా నష్టపోయిందని చెప్పినట్లు తెలిసింది. తనకు రాజకీయ వారసులు లేరని, వయోభారం దృష్ట్యా భవిష్యత్‌లో పోటీ చేస్తానో, లేదో కూడా తెలియదని, తెదేపా వ్యవస్థాపక సభ్యుడినైన తన వేదనంతా పార్టీ భవిష్యత్ కోసమేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ అంతర్గత లోటుపాట్లపై నేతల వద్ద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన బుచ్చయ్య..ఎన్ని విభేదాలు ఉన్నా పార్టీని మోసం చేయనని స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.
సమస్యలు పరిష్కరించుకుంటాం
బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీపై అలగలేదని, ఆయన అభిప్రాయాల్ని గౌరవించే విధంగానే పార్టీ ముందుకు వెళ్తుందని...త్రిసభ్య కమిటీ సభ్యుడు గద్దె రామ్మోహన్ చెప్పారు. స్థానికంగా పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, అవన్నీ పరిష్కరించుకుంటామని తెలిపారు.
గోరంట్లతో గంటన్నరసేపు చర్చలు జరిపాం. రాజమహేంద్రవరంలో ఆయనకు ఉన్న ఇబ్బందుల గురించి గోరంట్ల చెప్పారు. ఆయన ఇబ్బందులను అచ్చెన్నాయుడు స్వయంగా పరిశీలిస్తున్నారు. బుచ్చయ్య అభిప్రాయాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారు. చిన్న చిన్న సమస్యలే పరిష్కరించుకుంటాం. -గద్దె రామ్మోహన్‌రావు
అలక అందుకేనా...!
తనకు మంచి పట్టున్న రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో...పార్టీ అనుబంధ కమిటీల్లో పదవుల కోసం బుచ్చయ్యచౌదరి గతంలో కొన్ని పేర్లు సిఫార్సు చేశారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సూచించిన పేర్లనే అధిష్టానం పరిగణలోకి తీసుకుంది. అప్పటినుంచి బుచ్చయ్యచౌదరి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీకి ఎప్పటినుంచో పనిచేస్తున్న సీనియర్ల పేర్లను తాను సూచించినా..ఏ మాత్రం పట్టించుకోకపోవటం గోరంట్లను మనోవేదనకు గురి చేసిందని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు.
రాజీనామా కలకలం
బుచ్చయ్యచౌదరి పార్టీ అధిష్ఠానం తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి వారం రోజుల్లో రాజీనామా చేస్తానని సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. తక్షణమే స్పందించిన తెదేపా అధినేత చంద్రబాబు ఆయనకు ఫోన్‌చేసి మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలతో బుచ్చయ్యచౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ త్రిసభ్య బృందం ఆయనను కలిసింది.
ఇదీ చదవండి
CBN: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్..నేతల మంతనాలు