Sarpanch Innovative protest: ఏడాదికాలంగా తమ గ్రామ సమస్యలు పరిష్కరించడం లేదని.. అధికారులు పట్టించుకోవడంలేదని తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపర్రు సర్పంచ్ నరేంద్రబాబు వినూత్న రీతిలో స్పందన కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేశాడు. సర్పంచ్, ఉపసర్పంచ్, మరో ఇద్దరు వార్డు సభ్యులు అర్ధనగ్నంగా కార్యాలయానికి వచ్చి తహసీల్దార్‌కు తమ మొర విన్నవించుకుంటూ వినతి పత్రం అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామ సర్పంచ్ నరేంద్రబాబు గ్రామంలో శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్, రోడ్ల విస్తరణ, డ్రైనేజీ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఏడాది గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోగా.. అధికారులు సాకులు చెప్పడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రం సమర్పించారు.
గ్రామంలో శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ విస్తరణపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్లకు స్పందన కార్యక్రమంలో వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని తాడిపర్రు సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు అన్నారు. గడిచిన ఏడాది కాలంలో సుమారు తొమ్మిది వినతి పత్రాలు సమర్పించామని చెప్పారు. రహదారులు లేకపోవడంతో తమ గ్రామంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో 11 ప్రమాదాలు జరిగాయని వివరించారు. ప్రస్తుతం తాము ఇచ్చిన వినతి పత్రం పట్ల తహసీల్దార్ సానుకూలంగా స్పందించారని చెప్పారు త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు.
ఇవీ చదవండి: