సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు ఆకలితో అలమటిస్తున్నారు. సరైన ఆహారం అందక అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు బాలికలను ఇంటికి తీసుకెళ్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వి.కొత్తూరు గ్రామంలోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 540 మంది విద్యార్థినులు ఉన్నారు. కొన్ని రోజులుగా గుత్తేదారుడు సరకులు సరఫరా చేయకపోవడంతో నిర్వాహకులు సరైన ఆహారం అందించడం లేదు. ముఖ్యంగా 10 రోజులుగా చింతపండు, నూనె, కందిపప్పు, పోపు సామగ్రి అయిపోయాయి. ఉన్నతాధికారులకు చెప్పినా ప్రయోజనం లేదు. కేవలం బియ్యం, గుడ్లు, పాలు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులకు ఆహారం అందించేందుకు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తలాకొంత సమకూర్చి ఏ రోజుకారోజు సరకులు తెచ్చి వండిస్తున్నారు. సమయానికి ఆహారం అందక, అదీనూ సరిపోక విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల నర్సు కొంతమంది బాలికలకు ప్రాథమిక చికిత్స చేశారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మంగళవారం కొందరు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తేదారు సరకులు సరఫరా చేయడం లేదని తల్లిదండ్రులకు వివరించడంతో ఆందోళనకు గురైన వారు పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లారు.
ప్రస్తుతం 240 మంది విద్యార్థులే ఉన్నారు. ‘తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకెళ్లిన మాట వాస్తవమే. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. బిల్లులు రాకపోవడం, ధరలు పెరగడంతోనే గుత్తేదారుడు సరకులు సరఫరా చేయడం లేదు’ - నిర్మల కుమారి, ప్రిన్సిపల్ .
ఇదీ చదవండి: