SANKRANTI SAMBARALU : రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. చదువు, ఉద్యోగ రీత్యా పట్టణాల్లో ఉంటున్న వారు స్వగ్రామాలకు తరలిరావడంతో పల్లెలన్నీ సందడిగా మారాయి. భోగి పండుగ రోజు చిన్నారులపై భోగి పళ్లు పోయడం, సాంస్కృతిక క్రీడలు, పతంగులు ఎగరేయడం వంటి కార్యక్రమాలతో రాష్ట్రమంతటా కోలాహలం నెలకొంది.
పల్లె సంస్కృతిని చాటేలా బొమ్మల కొలువు: ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రామదీప్, ఏలూరు జీవవైవిధ్య యాజమాన్య కమిటీ సౌజన్యంతో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి పల్లె సంస్కృతిని చాటేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. కుండల తయారీ, ఎడ్ల బండ్ల ప్రదర్శనతో పాత రోజుల్ని గుర్తుచేశారు. విద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
చిన్నారుల ఫ్యాషన్ షో: గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అందరినీ ఉత్సాహపరిచాయి. చిన్నారుల ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అమ్మమ్మ వాళ్ల ఇంట్లో సంక్రాంతి: విజయవాడ భవాని ద్వీపంలో పల్లెటూరి వాతావరణంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ సినీతార ఆమని చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ల ఇంట్లో జరుపుకున్న సంక్రాంతి పండుగ రోజులు మళ్లీ గుర్తొచ్చాయన్నారు.
మకర జ్యోతి దర్శనం: అనకాపల్లి గవరపాలెం గౌరీ పంచాయతీలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనాన్ని భక్తులకు కల్పించారు.
ముగ్గుల పోటీలు: కర్నూలులోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో వీరశైవలింగాయతి సేవాసమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
భోగి పళ్ళు పోయు కార్యక్రమం: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని మహామండపం 7 వ అంతస్తు నందు ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా వేదమంత్రముల నడుమ చిన్నారులకు భోగి పళ్ళు పోయు కార్యక్రమం నిర్వహించారు.
గోదాదేవి కళ్యాణోత్సం: పల్నాడు జిల్లా వినుకొండలో మార్కాపురం రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీ ఐశ్వర లక్ష్మీపద్మావతి గోదాసహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణోత్సం వైభవంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని చింతల వెంకట రమణ స్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణాన్ని నిర్వహించారు.
ఎడ్ల బండి పోటీలు: అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడలో ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఈ పోటీలు కనువిందు చేశాయి. బాపట్లలోని ఏబీఎమ్ మైదానంలో కోన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకులు ఘనంగా నిర్వహించారు.
ఇవీ చదవండి