‘సదనం భూములు సమర్పయామి..’ శీర్షికన ఆదివారం ఈనాడులో ప్రచురితమైన కథనంపై అధికారుల్లో కదలిక వచ్చింది. సదనం భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చినా.. అప్పట్లో ఈవోను నియమించకపోవడం వల్లే ఆస్తుల పర్యవేక్షణపై దృష్టి సారించలేకపోయినట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈవోను నియమించాలని ఆ శాఖ భావిస్తోంది. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే చర్యలు చేపట్టే అవకాశం ఉందని అసిస్టెంట్ కమిషనర్ ‘ఈనాడు’కు తెలిపారు.
ప్రస్తుతం రాజమహేంద్రవరం వైశ్యసేవా సదనానికి చెందిన భూమిని ఇళ్ల పట్టాల కోసం ఇచ్చినప్పటికీ అవి రిజిస్ట్రేషన్ కాకుండా కమిషనరేట్ అధికారులు వాటిని నిషేధిత జాబితాలో పెట్టినట్లు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న భూములకు మినహా మిగిలిన 112 ఎకరాలు ఈ జాబితాలో ఉన్నట్లు వెల్లడించారు. ఆ భూములు దేవాదాయశాఖ పరిధిలో ఉన్నందువల్ల ఎవరి పేరునా రిజిస్ట్రేషన్ చేయవద్దని ఏసీ రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌కు సైతం ఓ లేఖ రాశారు. మరోవైపు భూములు అమ్మగా వచ్చిన రూ.14.52 కోట్లను రాజమహేంద్రవరం వైశ్యసేవా సదనం, దేవాదాయ శాఖ జాయింట్ అకౌంట్లో జమ చేయాలని ఎస్‌బీఐ రాజమహేంద్రవరం బ్రాంచికి కూడా లేఖ రాసినట్లు ఏసీ తెలిపారు
రూ. కోట్లు విలువచేసే వీటి సంగతేంటి..?
దేవాదాయశాఖ ఆస్తుల రిజిస్టర్ సెక్షన్-43లో పేర్కొన్న ఆస్తుల వివరాల ప్రకారం వైశ్య సేవా సదన సంఘానికి రాజమహేంద్రవరంలో రూ. కోట్లు విలువ చేసే అయిదు భవనాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇవి కాకుండా కోరుకొండ మండలం నిడిగట్లలోని 73, 75 సర్వే నంబర్లలో 26.58 ఎకరాలు రాజానగరం మండలం వెలుగుబందలోని 316/1, 316/2, 317, 318, 324, 338 సర్వే నంబర్లలో 37.46 ఎకరాలు, పెద్దాపురం మండలం ఆనూరులోని 377/1, 380, 381, 386, 376 సర్వే నంబర్లలో 53.02 ఎకరాలు భూములున్నాయి. వీటితోపాటు విజయనగరం జిల్లా పురిటిపెంటలోని 91/ఏ సర్వే నంబరులో 388 ఎకరాలు ఉన్నట్లు 43వ రిజిస్టర్లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఇచ్చేసిన ఈ 32.26 ఎకరాలను పక్కన పెడితే మిగిలిన భూముల పరిరక్షణకు అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సదనం సభ్యులు రాజమహేంద్రవరం రాజానగరం, కోరుకొండ మండలాల్లో మినహా మిగిలిన భూముల విషయం మాట్లాడడం లేదు. వైశ్య సేవా సదనం 2017లో దేవాదాయశాఖలో విలీనం అయినప్పుడే ఈవోని నియమించి ఉంటే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుని ఉండేవి కాదనేది పలువురి వాదన.
ఇదీ చదవండి: పీవోకేలో చైనా విమానం- సరిహద్దులో భారీగా బలగాలు