తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో సమాచార ప్రచార శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇండియన్ రిజర్వ్డ్ బెటాలియన్, స్పెషల్ పోలీస్, మహిళా పోలీస్, హోంగార్డ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
శాంతికి చిహ్నమైన తెల్లటి పావురాలను, త్రివర్ణ బుడగలను గాలిలో వదిలారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో ముందుండి పోరాడిన ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ సత్కరించారు. పుదుచ్చేరి ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతో వివిధ శాఖలు తమ ప్రగతిని తెలిపే శకటాల ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించలేదు.
కాకినాడలో...
పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఉన్నత జీవన ప్రమాణాలు లక్ష్యంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శాఖల వారీగా కలెక్టర్ వివరించారు. స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని కోరారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లాలో ఉత్తమ సేవలందించిన 65 శాఖలకు చెందిన 878 మంది అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.
అనపర్తిలో...
మండలంలో తెదేపా నాయకులు రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని నిర్వహించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్