వ్యవసాయ అనుబంధ రంగాల సేవలను గ్రామస్థాయిలో రైతు చెంతకే తేవాలనే ఆశయంతో రైతు భరోసా కేంద్రాలు కొలువుదీరాయి. అన్ని రకాల ఎరువులు అందుబాటులో లేకపోవటం... గడువులోగా సరఫరా చేయలేకపోవటం.. కొన్నిచోట్ల చెంతకే (డోర్ డెలివరీ) ఎరువులు, విత్తనాలు చేర్చకపోవటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఆశయం ఇలా...:
ప్రతి రెండు వేల జనాభాకు ఒక కియోస్క్ యంత్రం ఏర్పాటు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇంటికే పంపిణీ.
విత్తు వేసిన నాటి నుంచి పంట అమ్మే వరకు ఏ అవసరమైనా సహాయం, సమాచారం అందించడం.
దళారుల ప్రమేయం లేకుండా రైతే పంటను అమ్ముకునేలా తోడ్పాటు.
ప్రతిబంధకాలు ఇవే:
కాంప్లెక్సు ఎరువుల్లో రెండు, మూడు రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇంటికే పంపాలి. ఒకటి రెండు బస్తాలు అయితే ఇంటికి పంపడం లేదు. ఎక్కువ మొత్తం అయితేనే చేరుస్తున్నారని రైతులు అంటున్నారు.
అవగాహన అవసరం:
ప్రధానంగా రైతు భరోసా కేంద్రాల గురించి రైతుల్లో మరింత చైతన్యం తేవాల్సి ఉంది. విత్తు, ఎరువుల పంపిణీకి మే 30 నుంచి శ్రీకారం చుట్టగా స్పందన పెరగాల్సి ఉంది. రాజమహేంద్రవరం గ్రామీణం కోలవరు కేంద్రంలో కేవలం ఇప్పటి వరకు నలుగురే ఎరువులు తీసుకువెళ్లినట్లు సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుడు(వీఏఏ) తెలిపారు.
అయినవిల్లి మండల కేంద్రం-1లో ఇద్దరు, కేంద్రం-2లో ఇద్దరు, సిరిపల్లిలో నలుగురు మాత్రమే ఇప్పటి వరకు ఎరువులు తీసుకువెళ్లారు. చాలా కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది.
రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. కేంద్ర నిర్వహణ, రైతులకు ఎరువుల నమోదు వంటి వాటికి ఒక్కో కేంద్రానికి వీఏఏలను నియమించాల్సి ఉండగా.. కొన్నిచోట్ల రెండు కేంద్రాలకు కలిపి ఒక్కరే ఉన్నారు. ఈ-పంట నమోదు కూడా వీరికే అప్పగించడంతో వారిపై భారం పెరిగింది.
లోపాలను సరిదిద్దుతాం
రైతు భరోసా కేంద్రాల్లో ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నాం. సరకు కోరుతూ నమోదు చేసుకున్న 72 గంటల్లో ఇంటికే చేరుస్తున్నామని జేడీఏ ప్రసాద్ తెలిపారు. ఎక్కడైనా లోపాలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తామన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మటంతో రూ.1.44 కోట్ల ఆదాయం సమకూరింది. అన్ని రకాల సేవలు అన్నదాతలకు చేరువ చేసేలా సమగ్ర కార్యచరణ, ప్రణాళికతో సాగుతున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి