కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రేపు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతున్నందున.. ఆ ప్రాంతంలో మునుపెన్నడూ లేని రీతిలో పోలీసు సిబ్బందిని మోహరించారు. ఈ స్థానానికి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్నార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి పోటీలో ఉండడంతో.. ఎన్నికల సంఘం దృష్టంతా యానంపై కేంద్రీకరించింది.
రంగస్వామికి గట్టి పోటీ ఇస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థికి.. స్థానిక నాయకుల మధ్య రెండు రోజుల క్రితం ఘర్షణ జరగడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. గడిచిన పాతికేళ్లలో జరిగిన ఐదు ఎన్నికల్లో లేనివిధంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు ఆ ప్రాంతంలో. పుదుచ్చేరి నుంచి వచ్చిన 70 మంది పోలింగ్ అధికారులు, 140 మంది సహాయ పోలింగ్ అధికారులకి యానాం రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ పలు సూచనలు చేశారు.
భద్రతా చర్యల్లో భాగంగా 180 మందితో కూడిన రెండు సీఆర్పీఎఫ్ బలగాలు.. 70 మంది సభ్యులున్న ఇండో-టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గత వారం రోజులుగా పహారా కాస్తున్నాయి. వీరందరిని స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సమావేశపరిచారు. 60 పోలింగ్ బూత్ల వద్ద ఏ విధమైన ఘర్షణలకు జరగకుండా.. ఓటర్లు నిర్భయంగా ఓటు వేసుకునేలా ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నారు అధికారులు.
ఇదీ చూడండి. వారి దౌర్జన్యాలను నిలువరించేలా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: తులసిరెడ్డి