పి గన్నవరంలో
కరోనా వైరస్ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలోని సామాజిక ఆసుపత్రిలో ఐసోలేషన్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డును శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన వైద్యులకు సూచించారు. కరోనా వైరస్ గురించి రోగులకు విస్తృతమైన అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. రోగులు కూడా వైద్యుల సలహాలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
యానాంలో
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో లాక్‌డౌన్ నేపథ్యంలో 8 మార్గాలను మూసివేశారు. ప్రధాన రెండు మార్గాల ద్వారా రాకపోకలకు అనుమతించారు. సంతను, జాతీయ రహదారి సమీపంలోనున్న మద్యం షాపులను మూసివేశారు. ఇతర గ్రామాల నుంచి యానాంలోకి వచ్చే ప్రజల్ని వెనక్కి పంపించేస్తున్నారు. కూరగాయల విక్రయాలను మాత్రమే అనుమతించారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన నలుగురిని వైద్యులు పరీక్షించి... ముందుస్తుగా ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కొత్తపేటలో
రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దుకాణాలు ఎవరు తెరవకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట, రావులపాలెం ప్రాంతాల్లో పలువురు దుకాణాలు తెరిచి వ్యాపార నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించి మార్చి 31వ తేదీ వరకు తెరవరాదని తెలిపారు. దుకాణాల వద్ద కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండాలని... గుంపులుగా ఉండరాదని దుకాణ యజమానులకు వివరించారు. పలువురు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
ఇదీచూడండి. ఆంక్షలను పట్టించుకోని జనం....అధికారుల ఆగ్రహం