యుద్ధం చేయడం తప్ప... గెలుపోటములు తెలియదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం పదవి పై కోరిక లేదన్నారు. ప్రజలకు న్యాయం జరగటం కోసమే సీఎం పీఠాన్ని బాధ్యతగా చూస్తాన్నారు. తన గుండె ధ్యైర్యమే ఇంత వరకు నడిపించిందన్నారు... ఆ ధైర్యమే సీఎంని చేస్తుందని ఉద్ఘాటించారు. రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
2014 లో ఏమీ ఆశించకుండా తెదేపా, భాజపాకు మద్దతు పలికానని గుర్తు చేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేక బయటకొచ్చానని పవన్ తెలిపారు.
"నేను సీఎం కుమారుడిని కాను, నాకు వేల కోట్లు, పత్రికలు, ఛానళ్లు లేవు... మార్పు రావటానికి అవసరమైన పరిస్థితులున్నాయి... నాది మంత్రసాని పాత్రే..."- పవన కల్యాణ్
పవన్ బలం గోదావరి జిల్లాల్లోనే ఉందని కొందరంటున్నారని మండిపడ్డారు. తాను ఒక కులం, మతం, ప్రాంతం తరపున రాజకీయాల్లోకి రాలేదన్నారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు తనకు బలం ఉందని ఉద్ఘాటించారు. పోరాట యాత్రతో అన్ని జిల్లాల్లో బలం చూపించామన్నారు.