రాష్ట్రంలోనూ.. ఎగువ రాష్ట్రాల్లోనూ కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉద్ధృతి అధికంగా ఉంది. ఆనకట్టలో నీటిమట్టం 14.9 అడుగులకు చేరుకుంది. 14.5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసి..... లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 మండలాల్లోని గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్డీఆర్ఎఫ్ సహా వివిధ శాఖల అధికారులతో 32 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం లాంచీలు, మరబోట్లు సిద్ధం చేశారు.
- దేవీపట్నంలో భయం భయం
దేవీపట్నం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తొయ్యేరు, దేవీపట్నం, పూడిపల్లి, దండంగిని వరద నీరు ముంచెత్తింది. ఎ. వీరవరం, పోచమ్మగండి, గానుగులగొందు, పాతూరు గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీటి చేరికతో... గిరిజనలు కొండలపై తలదాచుకుంటున్నారు. సుమారు 15 వందల ఇళ్లలోకి వరద నీరు చేరి.. విద్యుత్ సరఫరా నిలించింది. కచ్చులూరు నుంచి కొండమొదలు వరకు 20 గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ములకలంకను వరద ముంచెత్తడంతో భయంతో ప్రజలు పడవలపై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఐ. పొలవరం మండలం మురముల్ల వద్ద ఇళ్లు నిటమునిగాయి.
- దిగువ గోదారిలోనూ..
కాటన్ బ్యారేజీ నుంచి భారీగా వరదనీరు వదులుతుండటంతో దిగువ గోదారిలోనూ.. వరద ఉదృతి తీవ్రంగా ఉంది. కోనసీమ లంకలను వరదనీ రు తాకుతోంది. అయినవిల్లి మండలం ఎదురుబీడెం వద్ద కాజ్‌వే ముంపు బారిన పడింది. కాజ్‌వేకు అవతల ఉన్న అద్దంకివారిలంక, వీవవల్లిపాలెం, అయినవిల్లి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కాజ్‌వే వద్ద ఏర్పాటు చేసిన పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. కోనసీమలో గోదావరి ఉద్ధృతికి లంక గ్రామాల్లో పంటలు, కూరగాయల తోటలు నీటమునిగాయి. పడవల్లో వెళ్లి... నీట మునిగిన కూరగాయాలను రైతులు తెచ్చుకుంటున్నారు. ఇటుకల బట్టీలు నీటిపాలయ్యాయి. రావులపాలెం, గోపాలపురంలోని గౌతమి వశిష్ఠ వంతెన వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ముందుజాగ్రత్తగా పశువులను కరకట్టల మీదకు తరలించారు..
- పోలవరం ప్రాంతం మునక..
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద పోటెత్తుతోంది. పోలవరం కడెమ్మ వంతెన పైనుంచి వరద నీరు భారీగా చేరుతుండటంతో... సమీపంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. టి.నర్సాపురం మండలం ఎర్రకాలువ దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చేపట్టారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని వరద నీరు చుట్టుముట్టింది. పెరవలి మండలం తీపర్రు, కాకర పర్రు గ్రామాల వెంబడి గోదావరి ప్రవాహం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇదీ చూడండి