గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాజమహేంద్రవరం వద్ద పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో 12 అడుగుల నీటి మట్టం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ వెనకకు మళ్లిన వరద నీటితో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో వరద నెమ్మదిగా ప్రవహిస్తోంది. వరద తీవ్రతతో విలీనమండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు రెండో రోజూ కొనసాగింది. ఎటపాకలో సుమారు 250ఎకరాల్లో వరి, మిరప పంటలు ముంపు బారినపడ్డాయి. వీఆర్ పురం మండలంలోని రహదారులపైకి నీరు చేరడంతో సుమారు 20 గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూనవరం మండలంపైనా వరద ప్రభావం పడింది. దేవీపట్నం మండలం ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతోంది.
ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 10లక్షల 19వేల లక్షల క్యూసెక్కులపైగా నీరు సముద్రంలోకి వదలడంతో గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినవిల్లి మండలం ఎదురుబీడెం కాజ్ వే పై వరద నీరు ప్రవహిస్తుండతో లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పి.గన్నవరం మండల పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక కాజ్ వేపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, పి.గన్నవరం, మామిడికుదురు, సఖినేటిపల్లి, మండలాలతోపాటు ఆలమూరు, కపిళేశ్వరపురం మండలాల్లోని నదీ తీరం పొలాలు ముంపు బారిన పడ్డాయి.
కేంద్రపాలిక ప్రాంతం యానానంలోని లోతట్టు ప్రాంతాల్నీ వరద చుట్టుముట్టేసింది.
ఇదీ చూడండి: ts Engineering colleges: అందుబాటులోకి సుమారు 94 వేల ఇంజనీరింగ్ సీట్లు... నేటి నుంచే వెబ్ ఆప్షన్లు