కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ తూర్పు గోదావరి జిల్లాలో ముగిసింది. వామపక్షాల నేతల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతగా ముగిసింది.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భారత్ బంద్‌కు మద్దతుగా వామ పక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. కాకినాడ ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదుట టైరు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వామపక్షాల నేతలు నినాదాలు చేశారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో రహదారులు వెలవెలబోయాయి.
ముమ్మిడివరం నియోజకవర్గంలో బంద్‌కు సంపూర్ణ మద్దతు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రవాణా, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయటంతో మార్కెట్ సెంటర్లు బోసిపోయాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఏలేశ్వరం జగ్గంపేటలలో సీపీఐ, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రావులపాలెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. తుని డిపో నుంచి కాకినాడ, రాజమహేంద్రవరం, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిపివేశారు. అమలాపురంలో కోనసీమ రైతు, జేఏసీ నాయకులు సమావేశమై నిరసన గళం వినిపించారు.
ఇదీ చదవండి: