తుఫాను భయంతో చేతికొచ్చిన పంట చేజారిపోతుందనే భయంతో తొందరగా ధాన్యం గట్టెక్కిస్తున్నారు. తడిస్తే అమ్ముడుపోదన్న ఆవేదనతో ముందే విక్రయించాలని చూస్తున్నారు. యంత్రాల ద్వారా కోత కోసినందున.. ఆ ధాన్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయడానికి కొర్రీలు పెడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధర ఎలాగూ లేదనీ.. కనీసం తమ దగ్గర ఉన్న ధాన్యం నిల్వ ఉంచుకొనే మార్గమైనా ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతుల వద్ద నేరుగా సేకరించాల్సి ఉన్నా.. తమ దగ్గరకు వచ్చిన ధాన్యాన్ని రకరకాల సాకులతో తిరిగి పంపించేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు మండలానికి 3 చొప్పున 15 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా... వాటి వివరాలు తమకు తెలియదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.