తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నా.. సమీపంలోని కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు అధికార యంత్రాగం పటిష్ట చర్యలు తీసుకోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. పోలీసులు, అధికారులు, ప్రజల సమష్టి కృషితో మహమ్మారికి దూరంగా ఉన్నారు యానాం జనాలు. కరోనా కట్టడికి డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా కార్యాచరణ సిద్ధం చేయగా.. ఆరోగ్య శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, పోలీస్ శాఖలు సమర్థంగా ఆచరణలో పెట్టాయి.
ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడం, పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టడం వంటివి చేశారు. పుదుచ్చేరి నుంచి సెక్రటరీ స్థాయి అధికారి 15 రోజులకోసారి వచ్చి పరిస్థితిని సమీక్షించేవారు. ఇతర ప్రాంతాల నుంచి యానాంకు వచ్చేవారి వివరాలు సేకరించడం, చెక్ పోస్టుల వద్ద పటిష్ట పహారా చేపట్టడం వలన గ్రామంలో కరోనా ప్రవేశించలేదు. ఇలా ప్రతి ఒక్క దశలో పక్కాగా వ్యవహరించిన కారణంగానే ఇప్పటివరకు ఒక్క కొవిడ్ కేసు నమోదుకాలేదు. ఇదే స్ఫూర్తిని మరింత కాలం కొనసాగించాలని అంతా లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవీ చదవండి: