‘పోలవరం నిర్వాసితులకు వెన్నుదన్నుగా ఉంటా. చిట్టచివరి నిర్వాసితునికీ న్యాయం జరిగే వరకు పోరాడుతా. అవసరమైతే జైలుకైనా వెళ్లడానికి సిద్ధమే...’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం నిర్వాసిత విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్‌ఫురంలో పర్యటించారు. కూనవరం మండలం టేకులబోరులో నిర్వాసితులతో మాట్లాడారు. ‘లక్షా తొంభై వేల మంది నిర్వాసితుల త్యాగఫలమే పోలవరం. అయిదేళ్ల తెదేపా పాలనలో 72 శాతం పనులు పూర్తి చేస్తే.. రెండున్నరేళ్ల జగన్‌రెడ్డి పాలనలో కేవలం నాలుగు శాతమే చేశారు. తెదేపా ప్రభుత్వం అయిదేళ్లలో రూ.11,531 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్‌రెడ్డి రెండున్నరేళ్లలో రూ.850 కోట్లు మాత్రమే వెచ్చించారు.
పునరావాస కాలనీల నిర్మాణాలకు, పరిహారాలకు డబ్బు లేదంటున్న జగన్‌రెడ్డి... అదే ప్రాజెక్టు వద్ద పెట్టేందుకు రూ.200 కోట్లతో తన తండ్రి విగ్రహాన్ని ఎలా తయారు చేయిస్తున్నారు? 2016లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరాకు రూ.19 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి.. 2019 పాదయాత్రలో రూ.తొమ్మిది లక్షలకు తగ్గించి.. రూ.పది లక్షలకు దిగజారారు. భూమికి భూమి, 25 రకాల వసతులతో నిర్వాసిత కాలనీలు, గతంలో పరిహారం పొందిన భూములకు ఎకరాకు రూ.5 లక్షలు అదనంగా ఇస్తానని బీరాలు పలికిన జగన్‌రెడ్డి నేడు నిర్వాసితులను పట్టించుకోవడం లేదు.
2019 వరద ముంపు బాధిత కుటుంబానికి రూ.2,500 ఇస్తానని చెప్పి.. ముంపు ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు...’ అని పేర్కొన్నారు. కేంద్రం రూ.550 కోట్లు నిర్వాసితులకు పరిహారం కింద విడుదల చేస్తే.. దాన్ని వైకాపా వారు కాజేశారని ఆరోపించారు. దీనిపై వైకాపా ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. ‘నిర్వాసితుల 12 డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. అన్ని పక్షాలతో డిమాండ్ల పరిష్కారానికి పోరాడతాం. వచ్చే ప్రభుత్వం తెదేపాదే. చంద్రబాబే సీఎం అవుతారు. నిర్వాసితులతోనే ప్రాజెక్టు ప్రారంభిస్తాం....’ అని లోకేశ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరావు, బాబురమేశ్, జడ్పీ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తెదేపా అరకు పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు జి.సంధ్యారాణి, అరకు పార్లమెంట్ తెదేపా అధికార ప్రతినిధి యడవల్లి భాస్కరరావు పాల్గొన్నారు.
భద్రాద్రి శ్రీరాముణ్ని దర్శించుకున్న లోకేశ్
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం భద్రాద్రి శ్రీరాముణ్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ‘ఐదు గ్రామ పంచాయతీల విలీనం విషయం ఏడేళ్లుగా నలుగుతోంది. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకుంటే రెండు నిమిషాల్లో నిర్ణయం తీసుకోవచ్చు. ముంపు మండలాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి శక్తిని అందించాలని దేవుణ్ని కోరుకున్నా...’ అని పేర్కొన్నారు. చెప్పారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇదీచదవండి: