WARNING BOARDS : నగరపాలికలు, పురపాలికల పరిధిలో ఖాళీ స్థలాలపై పన్నుల వసూలు ఎప్పటినుంచో ఉంది. మార్కెట్ విలువపై నగరాల్లో 0.5శాతం, పట్టణాల్లో 0.2శాతం పన్ను వేస్తున్నారు. కానీ చాలామంది ఈ శిస్తు చెల్లించరు. పన్ను కట్టనివారికి గతంలో అధికారులు ఫోన్లు చేసి చెప్పేవారు. స్పందించకపోతే నోటీసులు ఇచ్చేవారు. అప్పటికీ కట్టకపోతే స్థలాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టేవారు. నోటీసు రాగానే కొందరు బకాయిలు చెల్లించేవారు. ఇప్పుడు మాత్రం.. పన్నుల వసూళ్లకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పన్ను చెల్లించాల్సిన వారి జాబితా సిద్ధం చేసి.. నేరుగా ఆ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
అక్కడ ఏకంగా 300 ఖాళీ స్ఠలాల్లో బోర్డులు : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఏకంగా 300 ఖాళీ స్థలాల్లో బోర్డులు పెట్టేశారు. స్థల హక్కుదారులెవరూ ముందుకు రానందున.. ప్రభుత్వ స్థలంగా భావించి సచివాలయం, కమ్యూనిటీ హాళ్లు, ఆరోగ్య కేంద్రాలు కట్టబోతున్నామంటూ ప్లెక్సీలు పెట్టారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడపతో పాటు కొన్ని పట్టణాల్లోనూ ఇలాగే బోర్డులు పెట్టేలా అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. పన్ను కట్టకపోతే నోటీసులు ఇవ్వాలే తప్ప, భవనాలు కట్టేస్తామంటూ బెదిరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మూడు నెలల్లో 609కోట్ల రూపాయల పన్ను వసూలు లక్ష్యం: రాబోయే 3 నెలల్లో 123 పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో ఖాళీ స్థలాల నుంచి 609 కోట్ల 20 లక్షల రూపాయలు.. పన్నుల రూపంలో వసూలు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం ఉన్నతాధికారులు కమిషనర్లపై ఒత్తిడి పెంచడంతో.. వాళ్లు ప్రజలను భయపెడుతున్నారు. 2022 - 23లో ఖాళీ స్థలాలపై పన్నుల కింద 19వందల 71కోట్ల 16 లక్షలు వసూలు చేయాలన్నది లక్ష్యం. కానీ ఇప్పటి వరకు 127 కోట్ల 94 లక్షలే వచ్చాయి. దీనివల్ల కొందరు కమిషనర్లు, రెవెన్యూ అధికారులు.. లక్ష్యాలను చేరుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అమలాపురం పురపాలకలో 1951 ఖాళీ స్థలాలను గుర్తించిన అధికారులు.. చాలాచోట్ల హెచ్చరిక బోర్డులు పెట్టారు.
మరి పాత బకాయిలపై శ్రద్ద ఏది: పురపాలక, నగరపాలక సంస్థలకు ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను అత్యధికంగా బకాయి పడిన వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి 727 కోట్ల 87లక్షల రూపాయలు రావాల్సి ఉంది. చాలాచోట్ల ఇలాంటి బకాయిలపై అధికారులు దృష్టి సారించడం లేదు. రాజకీయ కారణాలతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం, సొంతిల్లు కట్టుకోవాలని సొంతూళ్లలో స్థలాలు కొని.. ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారినే లక్ష్యంగా చేసుకుని.. VLT కట్టాలంటూ భయపెడుతున్నారు.
ఇవీ చదవండి: