ప్రధాని మోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకి పిలుపునివ్వటంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకూ ఎవరూ ఇంటినుంచి బయటకు రాకూడదని సూచించగా... ఇవాళ మార్కెట్లు, రైతుబజార్లు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయించే వ్యాపార సముదాయాలు కిటకిటలాడాయి. రేపటికి అవసరమయ్యే సరకులను ఈరోజే కొనుగోలు చేశారు.
జన సమూహాల మధ్య తిరగకూడదని అధికారులు చెబుతున్నా చాలామంది లెక్కచేయటం లేదు. కొందరు మాస్కులతో బయటకు వస్తుంటే మరికొందరు సాధారణంగానే రద్దీ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. జిల్లాలో పలుచోట్ల పాల ప్యాకెట్ల కొరత ఏర్పడింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని విజయవంతం చేస్తామని వ్యాపారులు, ప్రజలు చెబుతున్నారు.
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు విస్తృత చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 1532 మందిని ఇప్పటిదాకా అధికారులు గుర్తించారు. వీరిని వారి నివాసాల్లోనే ప్రత్యేక గదుల్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. కాకినాడ జీజీహెచ్‌లోని ఐసోలేషన్ విభాగంలో ఇప్పటివరకూ 25 మంది చేరగా... వారిలో 20 మందికి వ్యాధి లేదని తేలింది. మరో ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం