తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలం తంటికొండ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద...ఘోర విషాదం చోటుచేసుకుంది. కొండపై నుంచి టాటా ఏస్ వాహనం బోల్తాపడి ఏడుగురు చనిపోయారు. పెళ్లివేడుకకు హాజరై...స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. వారు ఎక్కిన వాహనం అదుపు తప్పడంతో ఈ ఘటన జరిగింది.
రాజానగరం మండలం వెలుగొంద, గోకవరం మండలం ఠాకుర్ పాలానికి చెందిన వధూవరులకు గురువారం రాత్రి తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది. పెళ్లి తంతు పూర్తైన తర్వాత రాత్రి రెండున్నర గంటర సమయంలో వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు దాదాపు 22 మంది...వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆ వాహనం అదుపుతప్పి పైనుంచి మెట్ల మార్గం కింద పడిపోయింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
మెట్ల మార్గంలో వాహనం దొర్లుకుంటూ కిందపడటంతో... ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు, పోలీసులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరో 10 మంది రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన... పెళ్లి ఇంట శోకాన్ని మిగిల్చింది. బంధువుల హాహాకారాలతో తంటికొండ ఆలయ ప్రాంగణం, ఆస్పత్రి ఆవరణలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: శ్రీకాకుళం జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్..137 మంది బాలలు గుర్తింపు