Flood in Konaseema Villages: కోనసీమ లంక గ్రామాలను వరదనీరు చుట్టిముట్టింది. మూడు రోజులుగా వరద గుప్పిట్లో లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని సుమారు 40 లంక గ్రామాల ముంపుబారినపడ్డాయి. కొంత మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరద ఉద్ధృతితో... లోతట్టు లంక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. ఎక్కడికక్కడ కాజ్‌వేలు నీటమునిగాయి. కొందరు మరపడవలు, నాటు పడవలను ఆశ్రయించి నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు. పెరుగుతున్న వరదతో రాకపోకలు కష్టంగా మారాయి. పి.గన్నవరం మండలంలో లంక గ్రామాల ప్రజలకు వంతెన హామీ కలగానే మిగలడంతో జనం అవస్థలుపడుతున్నారు.
అయినవిల్లి మండలంలోని అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, చింతనలంక, కొండుకుదురులంక, పొట్టిలంక, అద్దంకివారిలంక ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగాయి. నాటుపడవలపై కొందరు ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలను సాగిస్తున్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను తరలించేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అయినవిల్లి మండలంలోని కె.పెదలంకలో వరదబాధితులకు 10 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేశారు. శాశ్వత పరిష్కారం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరద ఉద్ధృతితో సఖినేటిపల్లి మండలంలోని అప్పనారామునిలంక, సఖినేటిపల్లిలంక, కొత్తలంక, టేకిశెట్టిపాలెంలోని కొంతభాగం, మలికిపురం మండలంలోని రామరాజులంక, బాడవ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లోకి నడుంలోతు నీరు చేరడంతో జనం ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. టేకిశెట్టిపాలెంలో నివాసాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో ఏటిగట్టుపై గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. గర్భిణులు, పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని ..పాములు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మిడివరం మండలం గురజాపులంక గ్రామం వరద గుప్పిట్లో చిక్కుకుంది. మహిళలు పడవల్లో వెళ్లి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నాటు పడవపై వెళ్లి.. వరద ప్రభావాన్ని పరిశీలించారు. నిత్యావసరాలు, వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా తాళ్లూరు మండలంలోని పిల్లంక, గోవలంక, కొత్తలంక భూములు ముంపునకు గురయ్యాయి. కొబ్బరి, అరటి, బీర, దొండ తోటలు పూర్తిగా నీటమునిగాయి. వరద ముంచెత్తిన కొత్తలంక గ్రామాన్ని కలెక్టర్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కేశినకుర్రు గ్రామంలో పర్యటించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా..బాధితులను పునావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో వరదలో చిక్కుకున్న 9 మందితో పాటు 400 మేకలు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గోదారి ఉగ్రరూపంతో విలీన మండలాలు అల్లాడిపోతున్నాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు , వేలేరుపాడు విలీన మండలాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రుద్రం కోట, కోయిద గిరిజనులు కొండలపై తలదాచుకుంటున్నారు. వారందరినీ భూదేవి పేట పునరావాస కాలనీకి తరలించేందుకు అధికారులు లాంచీలను సిద్ధం చేశారు. రేపాకగొమ్ము ముంపు గ్రామంలో సుమారు 300 పశువులు చిక్కుకున్నాయి. వాటిని మైదానం ప్రాంతానికి తరలిస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వరద పరిస్థితిలను సమీక్షిస్తున్నారు.
అల్లూరి జిల్లా ఎటపాక మండలంలో చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి . ఎటపాక పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయాలు నీటమునిగాయి. రికార్డులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఎటపాక మండలంలో సుమారు 20 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.