పంట చేతికి వచ్చేందుకు.. రైతుల కష్టం చాలా ఎక్కువ. అన్నదాతలకు పశువులూ సాయం చేస్తాయి. రైతన్న ఆనందం కోసం ఎంతగానో కష్టపడతాయి. పాడి ద్వారా గోమాతలు ఆర్థికంగా ఆదుకుంటాయి. ఇలా తమ సంపదలకూ.. సంతోషాలకు కారణమైన పశువులను కృతజ్ఞతతో పూజించడమే కనుమ పండగ. అందుకే కనుమను పశువుల పండగ అని వ్యవహరిస్తుంటారు.
కనుమ రోజు ఉదయమే పశువులను చెరువుల దగ్గరికి తీసుకెళ్లి శుభ్రం చేస్తారు. నుదుటన పసుపు, కుంకుమలతో... కొమ్ములకు నూనెతో అలంకరిస్తారు. అనంతరం పశువులకు హారతి ఇచ్చి పూజిస్తారు. కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు.
కనుమ పండుగ ద్వాపర యుగం నుంచే ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు. గోవులు సుఖసంతోషాలతో జీవించేందుకు కారణమైన గోవర్ధనగిరితోపాటు తమ సుఖసంతోషాలకు కారణమైన గోవులకు కనుమ రోజున పూజ చేసేవారట. అప్పటి నుంచి కనుమ రోజు గోవులకు పూజ చేయడమనే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
ఇదీ చదవండి: