Janasena opposed the GO 217: రోడ్ల పక్కన చేపలు అమ్ముకుంటూ అవస్థలు పడుతున్న మత్స్యకార మహిళల్లో భరోసా నింపాల్సింది పోయి విచిత్రంగా ముఖ్యమంత్రి చేపలు అమ్ముకుంటానంటే ఎలాగని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. చేపల చెరువులకు ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించేలా ప్రభుత్వమిచ్చిన జీవో 217 వల్ల 4.30 లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని వివరించారు. తీరప్రాంతాల్లోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనసేన మత్స్యకార వికాస విభాగం చేపట్టిన ‘మత్స్యకార అభ్యున్నతి యాత్ర’ను కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని సూర్యారావుపేటలో ఆదివారం ఆయన ప్రారంభించారు. దారి పొడవునా మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారు. యాత్ర నర్సాపురం వరకు సాగుతుందని, ఈ నెల 20న అక్కడి సభలో తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పాల్గొని మత్స్యకారుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణను వివరిస్తారని తెలిపారు.
మత్స్యకారులు నివసిస్తున్న 560 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు 3వేల లీటర్ల డీజిల్ అవసరమైతే, కేవలం 300 లీటర్లే ఇస్తున్నారని.. వారిలో భరోసా నింపే వ్యవస్థ ఎక్కడా లేదని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోతే కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తానని శాసనసభలో జగన్ హామీనిచ్చి.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో 64 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారని తెలిపారు. గతేడాది ఒక్క కుటుంబానికీ బీమా వర్తించలేదని వివరించారు. జనసైనికుల కోసం పవన్‌కల్యాణ్ రూ.5 లక్షల చొప్పున అందేలా ప్రమాద బీమా ఏర్పాటు చేశారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో సూర్యారావుపేటలోని 500 కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బలవంతంగా ఖాళీ చేయించారని మనోహర్ ఆరోపించారు. యాత్రలో మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, మనుక్రాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: revenue:రాష్ట్రంలో రెవెన్యూ అగాధం! ... 900% దాటిన "రెవెన్యూ లోటు"