భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతిస్తోంది. భద్రాచలం నుంచి వరద తగ్గడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఆదివారం ఉపసంహరించారు. వరద ప్రవాహం దృష్ట్యా మిగతా రెండు ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. ప్రహహం కొంత మేర తగ్గినప్పటికీ.. లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలను వరద కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇళ్లు నివాసయోగ్యంగా లేక అవస్థలు పడుతున్నారు. పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.
దేవీపట్నం, చింతూరు, వీఆర్పురం, కూనవరం మండలాల పరిధిలోని 88 గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కోనసీమలోని పి.గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, అల్లవరం మండలాల్లోని 73 గ్రామాలను వరద చుట్టుముట్టింది. రాజమహేంద్రవరం, రామచంద్రాపురం, కాకినాడ డివిజన్లలోని లోతట్టు గ్రామాలదీ అదే పరిస్థితి.
ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల పరిధిలో 5వేల ఎకరాలలో వరిచేలు ముంపునకు గురయ్యాయి. కనుచూపు మేర చెరువుగా మారిన వరి చేలను చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లోనూ పంట పొలాలను వరద నాశనం చేసింది. ఆదుకునే నాథుడే లేడని రైతులు వాపోతున్నారు. డ్రెయిన్లు తీసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
జిల్లాలో 26 మండలాల్లోని 180 గ్రామాల్లో.. లక్షా 14 వేల 661 మందిపై వరద ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. వరదలో చిక్కుకుని ఇప్పటివరకూ ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారని చెప్పారు. 2 వేల 488 హెక్టార్లలో వరి, 10 వేల 624 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. వరద ప్రభావిత గ్రామాలైన ఉడుమూడిలంక, బుడుగులంక, జీ.పెదపూడిలంకలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ పర్యటించారు. బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారు.
ముమ్మరంగా సహాయ చర్యలు
దేవీ పట్నం మినహా అన్ని గ్రామాలకు రేపటిలోగా విద్యుత్తు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. జిల్లాలోని 26 మండలాల పరిధిలోని 180 గ్రామాలు ప్రభావితమయ్యాయన్నారు. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారని, మరో ఇద్దరు గల్లంతయ్యారని చెప్పారు. జిల్లాలో 137 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి... 57,607మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వివరించారు."వరదలకు 2,488 హెక్టార్లలో వరి,10,624 హెక్టార్లలో ఉద్యాన పంటలు నష్టపోయాయి. జిల్లాలో 109 ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఇంకా వరద ముంపులోనే 29,695 గృహాలు ఉన్నాయి" అని తెలిపారు.
రాజమహేంద్రవరం వద్ద తగ్గుతున్న వరద
వరద గోదారి శాంతిస్తున్న పరిస్థితుల్లో... ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ దగ్గర 15.50 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 15.61 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: