Godavari Delta Irrigation Canals Filled With Sewage: గోదావరి డెల్టా ప్రాంతంలోని సాగునీటి కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కాలువల్లో వ్యర్థాలు, పిచ్చి మొక్కలు పెరిగి, అస్థవ్యస్థంగా తయారయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా.. వాటికాయలవారిపాలెం వద్దనున్న గోదావరి డెల్టా ప్రధాన సాగునీటి కాలువ అస్థవ్యస్థంగా తయారైంది. ఈ కాలువలో చెట్టు కూలి దాదాపు నెలైంది. ఇంతవరకూ అధికారులు దాన్ని తొలగించలేదు. స్థానిక రైతులు.. ఫిర్యాదు చేసినా స్పందించటం లేదు. దానికి మూల్యమే.. కాలువలో పేరుకుపోయిన ఈ చెత్తచెదారం. ఇలా ఉంటే నీరు పారడం సాధ్యమేనా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
గోదావరి డెల్టా పరిధిలో 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో తూర్పు డెల్టాలో 2.81 లక్షల ఎకరాలు, మధ్య డెల్టాలో 2.01 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఇన్నిలక్షల ఎకరాల ఆశల సాగును మోసుకెళ్లే పంట కాల్వల పొడవునా.. గుర్రపు డెక్క పెరిగింది. గట్లు జారుతున్నాయి. స్లూయిజ్‌లు, లాకులు ఎండకు ఎండి వానకు తడిసి.. తుప్పుపట్టాయి. కనీసం గ్రీజు పెట్టే దిక్కూలేక.. అవి కదలడం లేదు.
కాటన్ బ్యారేజీ నుంచి నీరు తరలించే కాలువలపై.. హెడ్‌లాక్‌ల నిర్వహణే కీలకం. ఆత్రేయపురం హెడ్లాకులు ఎప్పుడు కూలతాయో తెలియనంత శిథిలావస్థకు చేరాయి. లొల్ల వద్ద లాకులు తుప్పు పట్టాయి. షట్లర్ల తలుపులకు రంద్రాలు పడి నీరు ధారల్లా కారుతోంది. మరమ్మతులకు మూడేళ్ల క్రితం 50 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారేగానీ అవేమి కార్యరూపం దాల్చలేదు. అంచనాలు 60కోట్లకు పెరిగాయేకానీ.. పనులు మాత్రం సాగలేదు.
అమలాపురం, పి. గన్నవరం కెనాళ్ల మధ్యలో నిర్మించిన రాతికట్ట.. బలహీన పడి నీళ్లు లీకవుతున్నాయి. మొండెపులంక, పొదలాడ, శివకోడు, సఖినేటిపల్లి లాకుల పరిస్థితి మరీ అధ్వానం. నీటి వృథా అరికట్టేందుకు తాత్కాలికంగా కిటికీల తలుపులు అడ్డుపెడితే.. అధికారులు దాన్నే శాశ్వత పరిష్కారంగా సరిపెట్టేసేలా ఉన్నారు.
మామిడి కుదురు దరాడ ఛానల్ నుంచి తాగునీరు తీసుకెళ్లే కాలువ.. మురుగు కాల్వ కంటే దారుణంగా ఉంది. ఇందులోకి సెప్టిక్ వ్యర్థాలు.. ఆసుపత్రి నుంచి బయోవ్యర్థాలు కలుస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా నిర్వహణకు నోచుకోక కాలువ స్వరూపమే కోల్పోయింది. నగరం వద్ద ఓఎన్జీసీ వాళ్లు గోడ నిర్మించారు. దీని వల్ల సాగుకు ఇబ్బందిగా ఉందని రైతులు వాపోతున్నారు. పాదయాత్రలో నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ భుజంపై చేయివేసి చెప్పిన జగన్.. ఆ హామీని కాలువల్లో కప్పేశారని రైతులు ఆక్రోశిస్తున్నారు.
గోదావరి తూర్పు డెల్టా ఆయకట్టులోని కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని, జగ్గంపేట అనపర్తి నియోజకవర్గాల పరిధిలోని కాల్వల పొడవునా పూడిక పేరుకుంది. పంటలకు నీరు అందకపోగా.. వర్షాలు వస్తే చేలల్లోని వరద నీరూ బయటకు పోయే పరిస్థితి లేదు.
ఇక 5.29 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పశ్చిమ డెల్టా కాల్వల పరిస్థితీ అస్తవ్యస్థమే. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి, ఉటాడ, చించినాడ ప్రాంతాల్లో కాల్వలు కనుమరుగవుతున్నాయి. చివరి భూములకు నీరందక రైతులు పంటవిరామం కూడా ప్రకటించిన దుస్థితి. పశ్చిమగోదావరి జిల్లాలో కాలువల నిర్వహణ, మరమ్మత్తులకు 20 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపితే.. ప్రభుత్వం 8 కోట్ల పనులే ఆమోదించింది. పోనీ అవైనా పూర్తిచేసిందా అంటే లేదు. టెండర్లు పూర్తయ్యేనాటికే నీరు వదిలారు. చేసేదేమీ లేక రైతులే బాగుచేసుకుంటున్నారు.
ఇల్లింద్రపర్రు గోస్తనీ-వేల్పూరు కాలువపై ఉన్న లాకులు బ్రిటీష్ కాలంలో నిర్మించినవి. ఈ లాకుల గోడల్లో మొక్కలు మొలిచి వృక్షాలుగా కూడా మారాయి. దీంతో గోడలు పడిపోయాయి. స్లూయిజ్ పూర్తిగా పాడైంది. ఇంత శిథిలావస్థకు చేరినా దీని మరమ్మత్తులకు గతిలేదు. గోదావరి డెల్టాలో సాగునీటి కాల్వల నిర్వహణ ఇంత అధ్వానంగా ఉంటే.. ప్రభుత్వం మాత్రం జూన్ 1నే పంట కాలువలకు నీరు విడుదల చేసేసి మా పనైపోయిందని చేతులు దులిపేసుకుంది. కాల్వల్లో నీరు పారేదారి సరిగా లేనప్పుడు.. ఎప్పుడు వదిలితే ఏం లాభమని రైతులు ప్రశ్నిస్తున్నారు.