38 రోజుల సుదీర్ఘ శ్రమ
అప్పట్లో నదిలో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో 300 అడుగుల లోతున ఉన్న బోటు వెలికితీతకు ఆటంకం కలిగింది. ఎన్‌డీఆర్‌ఆఫ్, నౌకాదళం బృందాలు, అగ్నిమాపకశాఖకు చెందిన వందలా మంది సుదీర్ఘంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. కాకినాడలోని ధర్మాడి సత్యం అనే ప్రైవేటు నిపుణుడితో రూ.22.70 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన బృందం సుదీర్ఘ శ్రమ అనంతరం 38 రోజుల తర్వాత బోటును బయటికి లాగారు. గాలింపు క్రమంలో 46 మృతదేహాలు లభ్యమవగా.. అయిదుగురిని గుర్తించలేకపోయారు.
ఇసుక మేటలు... పెద్ద రాయి
నదిలో భారీగా పేరుకుపోయిన ఇసుక మేటలు, పెద్ద రాయి కారణంగా బోటు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి పోలవరం వరకు పేరుకుపోయిన కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక మేటను తొలగించాలని నిర్ణయించారు. దీనిపై సర్వే చేయడానికి ఏడాదిగా నిధులు విడుదల కాలేదు.
సమగ్ర విచారణ... అందిన నివేదిక
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీతో మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షలు, స్వల్పంగా గాయపడిన, గాయాలు లేకుండా బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇచ్చారు. తెలంగాణ వారికి అక్కడి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున అదనంగా అందించింది. కేంద్ర ప్రభుత్వమూ రూ.2 లక్షల చొప్పున ఇచ్చింది.
* ప్రమాదంపై సమగ్ర విచారణకు ఏపీ జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఛైర్మన్‌గా కమిటీ వేయగా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా సూచనలు చేసింది.
* అన్నిరకాల బోట్ల అనుమతి, రాకపోకల పర్యవేక్షణకు 9చోట్ల కంట్రోల్ రూమ్‌లను నెలకొల్పారు. సింగనపల్లి, గండిపోచమ్మ, పోచవరం, పేరంటాలపల్లి, విజయవాడలోని భీంపార్కు, రాజమహేంద్రవరం, విశాఖలోని రుషికొండతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద వాటిని ఏర్పాటుచేశారు.
* బోట్ల లైసెన్సుల జారీలో భాగంగా తనిఖీలు, సర్వే జరగాల్సి ఉంది. సరంగులకు శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు అందించాల్సి ఉంది.
నీటిపైనే జీవనం... అందులోనే మరణం
ఊహ తెలిసినప్పట్నుంచి సముద్రం పైనే వారి జీవన ప్రయాణం. బోటు డ్రైవర్లుగా ఎందరో పర్యాటకులకు గోదావరి అందాలను చూపారు. కాకినాడలోని జగన్నాథపురం వాసులైన బోటు డ్రైవరు సంగాడి నూకరాజు, సహాయ డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ కచ్చులూరు బోటు ప్రమాదంలోనే మృతిచెందారు. ఈతలో నిష్ణాతులైనా... అనూహ్య ప్రమాదంతో అసువులు బాసారు.
చివరి చూపూ దక్కలేదు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామం నుంచి గతేడాది పాపికొండల విహార యాత్రకు వెళ్లిన 14 మందిలో... తొమ్మిది మందిని బోటు ప్రమాదం కబళించింది. ఈ ప్రమాదంలో గల్లంతయిన కొండూరి రాజ్‌కుమార్ ఆచూకీ నేటికీ దొరకలేదు. కొడుకు కడచూపూ దక్కలేదని నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఆటో నడుపుతూ ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన పెద్ద కొడుకును వారు కోల్పోయారు.
జ్ఞాపకాల్లోనే మిగిలారు
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రామకృష్ణారెడ్డి దంపతుల జీవితాల్లో బోటు ప్రమాదం తీరని విషాదం నింపింది. కొడుకు, కోడలు, వారిద్దరి పిల్లలూ పాపికొండల్లో జలసమాధి అయ్యారు. కొన్ని ఆధారాలతో మూడు మృతదేహాలను గుర్తించినా... గుర్తుపట్టలేని ఓ బాలుడి మృతదేహాన్ని మనవడిదంటూ అప్పగించారు. డీఎన్‌ఏ పరీక్షలతో నిర్ధారిస్తామని చెప్పి... రెండుసార్లు నమూనాలు సేకరించినా ఏమీ తేల్చలేదు.
ఇదీ చదవండి: