పుదుచ్చేరి ప్రభుత్వంతో యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2002 నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తోంది. ఇందుకు నెలకు 13 లక్షల 45 వేల చొప్పున ప్రభుత్వం సంస్థకు చెల్లిస్తుంది. 2016 మే తర్వాత పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి, ప్రభుత్వం నుంచి చెల్లింపులు కాకుండా ప్రజల నుంచే నేరుగా పన్నుల రూపంలో వసూలు చేయాలని సూచించింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తీవ్రంగా వ్యతిరేకించింది. నాటి నుంచి సంబంధిత దస్త్రంపై గవర్నర్ కొర్రీలు వేస్తూ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సంస్థలకు చెల్లింపుల విషయంలో కోతలు విధించడం, జాప్యం చేయడం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దాని వలన నిర్వహణ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
యానాంలో 300 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న యానాం ప్రజా స్వచ్ఛంద సేవ సంస్థకు ప్రభుత్వం నుంచి ఆరు నెలలకు సంబంధించి 80 లక్షల వరకు బకాయిలున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడంతో సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో సంస్థ ఈ నెల 1వ తేదీ నుంచి పనులు నిలిపేసింది. దీంతో 14రోజులుగా ప్రధాన రహదారులు, ఆలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి..డ్రైనేజీల్లో పూడిక తీయక పోవడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. వర్షాకాలం కావడంతో ఇతర అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తక్షణం సమస్య పరిష్కరించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
చెత్తను సేకరించి, డంపింగ్ యార్డ్ కు తరలించడానికి ఒక సంస్థ ద్వారా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఇల్లు, దుకాణాల నుంచి నెలకు వంద రూపాయల చొప్పున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఆ దిశగా ప్రయత్నించేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: రావులపాలెం మండలంలో మరో ఐదు కరోనా కేసులు