యానాంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కళాశాల ఒక గొప్ప కార్యక్రమానికి వేదికైంది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ దర్శనం పేరుతో మహాత్ముడి డిజిటల్ ఫొటోలు, గాంధీ జీవిత కథ ఆధారంగా ప్రచురితమైన పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. తణుకుకు చెందిన ప్రముఖ గాంధేయవాది వాడ్రేవు సుందర్రావు 1876 నుంచి 1931 సంవత్సరం వరకు గాంధీజీ జీవితంలో జరిగిన ప్రముఖ సంఘటనలకు సంబంధించి సేకరించిన చిత్రాలను డిజిటలైజేషన్ చేశారు. ఈ ప్రదర్శనలో భాగంగా బాపూ బాల్యం నుంచి దక్షిణాఫ్రికా ప్రయాణం, అక్కడ నిరసనలు, రౌండ్‌టేబుల్ సమావేశం, 1948లో గాంధీ అస్తమయం వరకు ఫోటోల రూపంలో ప్రదర్శనకు ఉంచారు. మహాత్ముడిపై వివిధ రచయితలు రాసిన పుస్తకాలతో పాటు, గాంధీజీ ఆత్మకథ పుస్తకాలను ప్రదర్శించారు. స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల, పాఠశాల విద్యార్థులు సందర్శించి, ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వాడ్రేవు సుందర్రావు మాట్లాడుతూ గాంధీ అంటే ఓ స్వతంత్ర్య సమరయోధుడనే విషయం తప్ప, దేశం కోసం ఆయన పడిన అవమానాలు, కష్టాలు చాలామందికి తెలియజేసేందుకే ఈ కార్యాక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: