Fraud in name of solar motors: తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన రవి అనే రైతుకు హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ పేరిట ఫోన్ వచ్చింది. పునరుత్పాదక ఇంధన వనరులశాఖ (నెడ్‌క్యాప్), అదానీ సోలార్ సంస్థలకు అనుబంధ కంపెనీగా వ్యవహరిస్తున్నామని, 90 శాతం సబ్సిడీపై సౌర విద్యుత్ మోటారును అందిస్తామని చెబుతూ దరఖాస్తు కోసం రూ.3వేలు, లబ్ధిదారుడి వాటా కింద 10 శాతాన్ని కంపెనీ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించారు. అలాగే, నివాస భవనాలకు 100 శాతం సబ్సిడీ కింద రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఇస్తామంటూ ఆశపెట్టారు. ఇది ఒక్క రవికి ఎదురైన అనుభవమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలి కాలంలో అనేక మందికి ఇదే తరహా బోగస్ ఫోన్లు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఖరారు చేయక పోవడంతో పీఎం కుసుమ్ యోజన కింద సౌర మోటార్ల పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయటానికి కేంద్రం అనుమతించలేదు. ఇదే అవకాశంగా చేసుకుని కొన్ని బోగస్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. 90 శాతం రాయితీ ధరకు సౌర విద్యుత్ మోటార్లు ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్నాయి. కొన్ని కంపెనీల పేరుతో రైతులకు ఫోన్లు వస్తున్నాయి. దీన్ని నమ్మి కొందరు రైతులు కంపెనీ బ్యాంకు ఖాతాలో 10 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేసి నష్టపోయారు.
అప్రమత్తంగా ఉండాలన్న నెడ్‌క్యాప్..
ఇళ్ల పైకప్పుపై సౌర విద్యుత్ ప్రాజెక్టు పథకాన్ని అమలు చేసే బాధ్యతను కేంద్రం డిస్కంలకు అప్పగించింది. ఈ పథకం కింద ప్రాజెక్టులను మంజూరు చేయడాన్ని రాష్ట్రంలో డిస్కంలు ప్రారంభించలేదు. కేంద్ర నిబంధన ప్రకారం 3 కిలోవాట్ల వరకు బెంచ్‌మార్కు ధరలో 40 శాతం సబ్సిడీ, 3 కిలోవాట్లకు మించి 10 కిలో వాట్ల వరకు.. 3 కిలో వాట్ల వరకు 40 శాతం సబ్సిడీ పోను మిగిలిన 7 కిలోవాట్లకు 20 శాతం వంతున కేంద్రం రాయితీ ఇస్తుంది. బోగస్ కంపెనీ పేరిట ఫోన్ చేసేవారు మాత్రం 100 శాతం సబ్సిడీపై అందిస్తామని ఆశ చూపి మోసగిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు రాయితీ పథకాలు రాష్ట్రంలో అమలులో లేవని.. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెడ్‌క్యాప్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: Farmers Huge losses: అన్నదాతల అప్పుల సాగు.. చితికిపోతున్న వారిలో 80% కౌలు రైతులే