తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల పరిధిలోని ప్రధాన పంట కాలువలకు చివరనున్న వేల ఎకరాల వరిచేలకు నీరందటంలేదని రైతులు నిరసన చేపట్టారు. కాలువలో ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్ల ద్వారా తోడేస్తుండటంతో... చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్ట దశలో ఉన్న చేలల్లో నీరు ఉండాలని... నీరు లేక వరి దుబ్బులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం పంట దిగుబడి పైనా ఉంటుందని.. కౌలుకు తీసుకొని అప్పులు చేసి పంట వేశామని.. తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు వాపోయారు. అధికారులు మార్చి నెలాఖరు వరకు నీరు అందించాలని కోరుతున్నారు.
డిసెంబర్ నెలాఖరులోనే వరి నాట్లు పూర్తి చేయాలని.. మార్చి మొదటి వారం నుంచి పంటలకు సాగునీరు నిలిపి వేస్తామని రైతులకు ముందుగానే ప్రభుత్వం హెచ్చరించింది. కూలీల కొరత, ఇతర కారణాలతో జనవరి నెలలోనూ రైతులు వరినాట్లు వేశారు. ఫిబ్రవరి నెలలోనే నీటి ఎద్దడి ప్రారంభమై శివారు భూములకు నీరందక వరి చేలు నెర్రలు వారుతున్నాయి.
ఇదీ చదవండి...