కోనసీమ పేరు చెప్పగానే పచ్చదనం పరుచుకున్న ప్రకృతి.. మన కళ్లముందు కనువిందు చేస్తోంది. కొబ్బరి, అరటి తోటలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ గోదావరి సెంట్రల్ డెల్టా పరిధిలో సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి. అయితే 2011 లో రైతులు పంట విరామం ప్రకటించినప్పుడు.. అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. డ్రైయిన్‌లు నిండిపోవడం, వరి పొలాలు ముంపు బారిన పడటంతో.. ప్రస్తుతం ముమ్మిడివరం మండలం అయినాపురం రైతులు పంట విరామం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కోనసీమలో గత కొన్నేళ్లుగా ఖరీఫ్‌లో వరి చేలను ముంపు సమస్య పట్టిపీడిస్తోంది. సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం, అయినవిల్లి, ముమ్మడివరం, కాట్రేనికోన మండలాల్లోని వరి పొలాలు ముంపులో మగ్గిపోతున్నాయి. ఏటా ఎనిమిది వేల ఎకరాలపైగా విస్తీర్ణంలో వరి పంటను నాట్లు వేయకుండా రైతులు వదిలేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు గాను ఈ నెల 15వ తేదీనే గోదావరి డెల్టాలో పంట కాల్వలకు అధికారులు నీరు వదిలినా.. రైతులు వరి నాట్లు వేసేందుకు ఆసక్తి కనబరచట్లేదు.
అయినాపురంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడంతో జిల్లా వ్యవసాయ అధికారులు గ్రామానికి వచ్చి.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్రాప్ హాలిడే నిర్ణయం విరమించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కానీ రైతులు మాత్రం తమ నిర్ణయానికే కట్టుబడే ఉన్నామని తేల్చిచెప్పారు. అయినాపురంలో సుమారు 200 మంది రైతులుండగా.. 800 ఎకరాలున్నాయి.
ఇదీ చదవండి: