తూర్పుగోదావరి జిల్లా భానుగుడి సెంటర్ కాకినాడలోని జేఎన్‌టీయూ నన్నయ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. జేఎన్‌టీయూకే అనుబంధంగా 35 ప్రైవేటు కళాశాలలున్నాయి. జేఎన్‌టీ యూకేలో ప్రత్యేకంగా కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సులుంటే.. ఈ విశ్వవిద్యాలయంతోపాటు అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో సివిల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఫార్మసీ, అగ్రికల్చర్, మైనింగ్, డెయిరీ టెక్నాలజీ, ఆటోమొబైల్ కోర్సులున్నాయి.
జిల్లాలోనూ చక్కటి అవకాశాలు...
జిల్లా భౌగోళిక స్వరూపం, వనరుల ఆధారంగా కళాశాలల్లో ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, పెట్రోలియం, కెమికల్, మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు కంప్యూటర్ సైన్స్‌లోనూ సాంకేతికపరమైన పలు కోర్సులున్నాయి.
ప్రస్తుత పరిస్థితి..
నాస్కామ్ నివేదిక ప్రకారం.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 25 శాతం ఉపాధి పొందుతున్నారు. క్యాంపస్ ద్వారా ఎంపికైన వారికి సంస్థలు 16-24 వారాల శిక్షణనిస్తున్నాయి. శిక్షణకు ఏటా రూ.1,062 కోట్లు ఐటీ పరిశ్రమ ఖర్చుచేస్తోంది.
కేంద్ర మానవ వనరుల శాఖ లెక్క ప్రకారం దేశంలో 6,214 ఇంజినీరింగ్ విద్యాసంస్థలున్నాయి. ఇవి 2.9 మిలియన్ (29 లక్షల) మందిని చేర్చుకుంటుండగా ఏటా 15 లక్షల మంది కోర్సు పూర్తిచేసి బయటకొస్తున్నారు.
భలే మంచి ప్యాకేజీలు..
ఇంజినీరింగ్ విద్యలో రాణించిన విద్యార్థుల్లో చివరి సంవత్సరం ప్రాంగణ ఎంపికల్లో కొందరు నాలుగైదు కొలువులు సాధిస్తుండడం గమనార్హం. రూ.3.20 లక్షల నుంచి రూ.12 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. జిల్లాలో ఈ మధ్య అమెజాన్ సంస్థ నిర్వహించిన ఎంపికల్లో ఇద్దరు విద్యార్థులు ఏడాదికి రూ.25 లక్షల ప్యాకేజీతో కొలువులు పొందారు.
జిల్లాలో ఇలా.. మొత్తం ఇంజినీరింగ్ కళాశాలలు37
బోధనలో వైవిధ్యం
డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇంజినీరింగులో కంప్యూటర్ ఆధారిత కోర్సులకు జిల్లాలో ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా తరగతులు సైతం నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాలున్న కోర్సులు అందుబాటులోకి తెస్తున్నారు. స్థానిక వనరులు, పరిశ్రమలకు అనుబంధ కోర్సులు పెడుతున్నారు. స్థానిక పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా జేఎన్‌టీయూకేతోపాటు పలుచోట్ల కసరత్తు చేస్తున్నారు.
ప్రాంగణానికి తరలివస్తున్నాయ్...
జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏటా ప్రాంగణ ఎంపికల ద్వారా నైపుణ్యం ఉన్న విద్యార్థులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఎల్‌అండ్‌టీ,
ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, మ్యాథ్‌వర్క్స్, ఐటీసీ, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వ్యాల్యూ ల్యాబ్స్, హ్యుందయ్, యునైటెడ్ ఆన్‌లైన్, టాటా ప్రాజెక్ట్స్, టెక్ మహేంద్ర, మేథా సెర్వో డివైజ్(ఆర్‌అండ్‌డీ), ఎన్‌ఎఫ్‌సీఎల్, కోరమండల్, అరబిందో, డెక్కన్ కెమికల్స్, సెరియం సిస్టమ్స్, స్కాట్రోనిక్స్, ఎఫ్‌టీడీ, నల్‌సాఫ్ట్, విప్రో, డైకిన్ ఆర్‌అండ్‌డీ, వెమ్ టెక్నాలజీ, ఇనోజెంట్ తదితర సంస్థలు ఏటా ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాయి.
సొంతంగా ఆలోచించాలి..
విద్యార్థులు రోజూ తరగతులు పూర్తయ్యాక కనీసం వ΄డు నుంచి నాలుగు గంటలు సబ్జెక్ట్‌లు చదువుకోవాలి. ఒక్కరోజు తరగతి కోల్పోయినా ఇబ్బందే. సొంతంగా ఆలోచించగలగాలి. సందేహాలుంటే అధ్యాపకులు, సీనియర్లతో నివృత్తి చేసుకోవాలి. - ఆచార్య బి.బాలకృష్ణ, ప్రిన్సిపల్, జేఎన్‌టీయూకే
నైపుణ్యంతోనే ఉద్యోగం..
ప్రాంగణ ఎంపికల్లో రాణించాలంటే విద్య, సాంకేతిక నైపుణ్యాలు అవసరం. జేఎన్టీయూకేలో ఏటా 30 వరకు సంస్థలు ఎంపికలు నిర్వహిస్తుంటాయి. - ఎన్.రామకృష్ణయ్య, ప్లేస్‌మెంట్ అధికారి
ఆ ప్రాజెక్టులతోనే...
2017లో బీటెక్ పూర్తిచేశా.. రూ.18 లక్షల ప్యాకేజీతో మ్యాథ్‌వర్క్స్ సంస్థలో హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరా. సైంటిఫిక్ కంప్యూటింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో సీనియర్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా చేస్తున్నా. వెబ్ టెక్నాలజీపై చేసిన ప్రాజెక్టులు అవకాశాలు తెచ్చిపెట్టాయి. - నల్లా హరికృష్ణ
ఆత్మవిశ్వాసమే ఆయుధం
ఈఈఈ చివరి సంవత్సరం చదువుతున్నా. టీసీఎస్ డిజిటల్ విభాగానికి రూ.7.20 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యా. పైథాన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఉపయోగించి రూపొందించిన గేమ్ ఉద్యోగావకాశం దక్కడానికి ఉపయోగపడింది. ప్రాంగణ ఎంపికల్లో ప్రతి ప్రశ్నకు ఆత్మ
విశ్వాసంతో సమాధానం చెప్పగలగాలి. - ఎస్.లక్ష్మీశ్రీదీప్తి, ఈఈఈ విద్యార్థిని
మొదటి ఏడాది నుంచే ముందుందాం
- సరైన శిక్షణ పొందుతూ, అనుశీలన పద్ధతులను పాటించాలి.
- ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. లోతైన విశ్లేషణ అలవరచుకోవాలి.
- కంప్యూటర్ కోడింగ్ భాషలు, ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి.
- ప్రశ్నించేతత్వం అలవాటు చేసుకుంటే కొత్త ఆవిష్కరణల వైపు దృష్టి పెట్టవచ్చు.
ప్రాంగణ ఎంపికల వేళ..
- ప్రాథమిక అంశాలపై ఎంత పట్టుందని పరిశీలిస్తారు.
- ఎదుటి వ్యక్తితో ఎంత సాధికారికంగా మాట్లాడుతున్నారన్నది గమనిస్తారు.
- తార్కిక ఆలోచన, సమస్యను పరిష్కరించే పద్ధతిని గుర్తిస్తారు.
- చిత్తశుద్ధికలిగి ఉంటే సమస్యను సులువుగా పరిష్కరిస్తారని నమ్ముతారు.
ఇదీ చదవండి: