ఓ లారీ చోదకుడు పోగోట్టుకున్న సొమ్మును నిజాయితీతో బాధితుడికి అప్పగించిన ఏఎస్ఐను జిల్లా ఎస్పీ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ తాతపూడి ఉదయ్ కుమార్... అరటి లోడును తీసుకుని జాజ్పూర్ నుంచి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం ఏటీ అగ్రహారం తీసుకొచ్చాడు. అక్కడ సరకు దించిన అనంతరం సమీపంలోని ఆనందపురంలో ఉంటున్న తన కుమారుని వద్దకు బయలుదేరాడు.
ఉదయం 5 గంటల సమయంలో ఆటోలో బయలుదేరి నాతవలస ఇసుక చెక్ పోస్ట్ దగ్గరకు వెళ్లగా తన కుమారుడు ఎదురుగా ద్విచక్ర వాహనం మీద రావడంతో అక్కడే ఆటో దిగిపోయాడు. కుమారుడితో వెళ్లే సమయంలో ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇచ్చే క్రమంలో ఉదయ్ కుమార్ వద్ద ఉన్న 34 వేల నాలుగు వందలు అతని జేబులో నుంచి పడిపోయాయి. ఇది గమనించక ఆయన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆనందపురం వెళ్లిన తరువాత జేబులో డబ్బులు లేకపోవడం గమనించిన ఉదయ్ కుమార్.. తిరిగి ఎక్కడైతే ఆటో దిగాడో అక్కడ వెతకడం ప్రారంభించాడు. సమీపంలో ఉన్న వారందరినీ డబ్బుల కోసం అడుగుతూ నానా అవస్థలు పడ్డారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న డెంకాడ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాంబాబు రహదారి పక్కన పడి ఉన్న నగదును చూసి సమాచారాన్ని భోగాపురం సీఐ శ్రీధర్ కు తెలియజేసి నగదు ఆయనకు అందించారు. డబ్బుల వెతుకులాటలో నలుగురైదుగురిని అడగడం గమనించిన ఏఎస్ఐ రాంబాబు... ఉదయ్ కుమార్ ను పిలిచి ఆరా తీశారు. పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తర్వాత ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి జిల్లా ఎస్పీ రాజకుమారి సమక్షంలో లారీ డ్రైవర్ కు నగదును అందజేశారు.
ఇదీ చదవండి: