Girlfriend killed her boyfriend in East Godavari district: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో పోయిన గురువారం నాడు.. ప్రేమించిన ప్రియుడిని.. ప్రియురాలు హత మార్చిన ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోకవరం పోలీస్ స్టేషన్ వద్ద శనివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మృతుడు, నిందితురాలికి మధ్య ప్రేమ వ్యవహారం, నగదు లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగిందని.. వారి వద్ద నుంచి ఒక బైకు, రెండు సెల్‌ఫోన్లు, కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
లావాదేవీల నేపథ్యంలోనే హత్య.. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామానికి చెందిన ఓమ్మి నాగ శేషు(25), అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం చెలక వీధికి చెందిన కుర్ల డెబోరాలు ఆరేళ్లపాటు ప్రేమించుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆమె వద్ద నుంచి నాగ శేషు రూ రెండు లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకున్నాడు. ఏడాది క్రితం నాగ శేషు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో డెబోర తన స్నేహితుడైన కరణం శివన్నారాయణ అనే మరో యువకుడితో ప్రేమలో పడి అతనితో కలిసి గోకవరంలోనే నివాసం ఉంటుంది. తనను మోసం చేసి మరో వివాహం చేసుకున్న నాగ శేషు పై కక్ష పెంచుకుంది.
రెండో ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడి ఇంటికెళ్లి హత్య.. తనకు రావాల్సిన సొమ్ములను ఇవ్వాల్సిందిగా పలుమార్లు డిమాండ్ చేసింది. అయినా నాగ శేషు వినకపోవడంతో అతనిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకుంది. తన తాజా ప్రియుడు శివన్నారాయణ తో కలిసి ఈనెల 10 తారీకు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మాజీ ప్రియుడు నాగ శేషు ఇంటికి వెళ్ళింది. డాబాపై నిద్రిస్తున్న నాగ శేషుని లేపి గొడవ పెట్టుకున్నారు. అనంతరం వారు వెంట తీసుకు వెళ్లిన కత్తిపీట, జామాయిల్ కర్రతో దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడిన నాగ శేషు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
దీనిపై కేసు నమోదు చేసిన కోరుకొండ సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్సై శివ నాగబాబు శనివారం ఉదయం నిందితులను అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి నేరం చేయడానికి ఉపయోగించిన బైకు, రెండు చరవాణిలు, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తామన్నారు. కేసులో ప్రతిభ చూపిన కోరుకొండ సీఐ ఉమామహేశ్వరరావు, గోకవరం ఎస్సై శివ నాగబాబు, సిబ్బందిని రాజమండ్రి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.
ఇవీ చదవండి: