Donate Organs Become Life Donors: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు సమీపంలోని వేలివెన్ను గ్రామానికి చెందిన సతీశ్‌కుమార్ అనే యువకుడు తాను వివాహం చేసుకునే రోజునే తనతోపాటు తన బంధువులు, స్నేహితులతో కలిసి అవయవదాన హామీ పత్రాలు సమర్పించాలని నిర్ణయించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాబోయే భర్త ఆలోచనకు మెచ్చి పెళ్లి కుమార్తె సజీవరాణి కూడా అవయవదాన హామీ పత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
విశాఖలోని ‘సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్’ ఛైర్‌పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి ఈనెల 29వ తేదీన నిడదవోలులో జరిగే వివాహ వేడుకకు హాజరై ఆయా పత్రాలను స్వీకరించనున్నారు. వివాహం సందర్భంగా ఏదైనా మంచి పనిని వినూత్నంగా చేయాలన్న ఉద్దేశంతోనూ, వివాహం రోజునే ఒక మంచి పనికి నాంది పలకాలన్న లక్ష్యంతోనూ వధూవరులిద్దరూ ఆ మేరకు నిర్ణయించుకున్నారు.
వారి ఆలోచనకు మెచ్చిన వారి బంధువులు, స్నేహితుల బృందంలో సుమారు 60 మంది వరకు తాము కూడా అవయవదాన హామీ పత్రాలు సమర్పించడానికి ముందుకు రావడం గమనార్హం. వారి పెళ్లి పత్రికలో ‘అవయవ దానం చేయండి- ప్రాణదాతలు కండి’ అని ముద్రించి అవయవదాన ఆవశ్యకతను విస్తృతంగా ప్రచారం చేస్తూ సతీశ్‌కుమార్ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అవయవదానం చేస్తే పలువురి ప్రాణాలు నిలబడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ‘విల్లింగ్ టు హెల్ప్ ఫౌండేషన్’ నిర్వాహకులు నిఖిల్, పూజితల సాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని సతీశ్‌కుమార్ ‘ఈనాడు’కు వెల్లడించారు.
ఇవీ చదవండి