తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రామకృష్ణాపురానికి చెందిన ఓ వ్యక్తి తన తండ్రికి మధుమేహం, బీపీ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో 15 రోజులకోసారి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. కొవిడ్ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఓపీకి వెళ్లడం లేదు. ఇప్పుడు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో వైద్య సలహాలు పొందుతూ వారి సూచనల మేరకు మందులు వేసుకుంటున్నారు.
కోరుకొండ మండలం బుచ్చింపేటకు చెందిన అయిదు నెలల గర్భిణి ప్రతి 15 రోజులకోసారి చెకప్ కోసం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేవారు. కొవిడ్ తీవ్రత, రవాణా సమస్యలతో వెళ్లడం వీలుకుదరలేదు. వైద్యురాలిని ఫోన్‌లో సంప్రదిస్తే ఆన్‌లైన్ వైద్యం ఉపాయం చెప్పారు. నెలకు రెండు సార్లు వెళ్లాల్సి ఉన్నా.. ఒకసారి నేరుగా వెళ్లి ఇంకోసారి ఆన్‌లైన్‌లో సేవలు పొందుతున్నారు.
ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో సాధారణ వైద్యసేవలకు ఆసుపత్రికి వెళ్లాలంటే కుదరని పరిస్థితి. మరోపక్క కర్ఫ్యూ నిబంధనల కారణంగా రవాణా సౌకర్యం లేక రాకపోకలూ సాగడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆన్‌లైన్ వైద్యానికి రోగులు, వైద్యులు ప్రాధాన్యమిస్తున్నారు. వైద్యులు వీడియో కాల్, స్కైప్‌లో రోగుల నాడిపట్టి వారికి మందులిస్తూ భరోసా కల్పిస్తున్నారు. మొదటిసారి నేరుగా రోగిని చూసి తర్వాత నుంచి ప్రతి 15 రోజులకోసారి ఆన్‌లైన్‌లో ఓపీ చూసి మందులు రాస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆన్‌లైన్ వైద్యసేవలకు 30 శాతం మంది మక్కువ చూపిస్తున్నట్లు వైద్యవర్గాల అంచనా. సుమారు 400 నుంచి 500 మంది వైద్యులు తమ రోగులను ఆన్‌లైన్ ద్వారా పలకరిస్తున్నారు.
రోజూ 20 మంది వరకు...
నిత్యం 15 నుంచి 20 మందికి ఆన్‌లైన్‌లో వైద్యసేవలందిస్తున్నా. వీడియోకాల్‌లో ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అవసరాన్ని బట్టి మందులు మార్చుతున్నాం. బీపీ, మధుమేహం, జ్వరం, పల్స్, హార్ట్‌బీట్ తెలుసుకునే పరికరాలు కొనుగోలు చేసుకుని వారి వంతు వచ్చినప్పుడు వీడియోకాల్‌లో వైద్యుడికి చెబితే ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసే వీలుంటుంది. అత్యవసర చికిత్స అవసరమైతే ఏ సమయంలో ఫోన్ చేసినా మాట్లాడుతున్నాం. -డాక్టర్ వడ్డాది సురేష్, ఎండీ (జనరల్ మెడిసిన్)
వినియోగించుకోవాలి..
గర్భిణులు దాదాపు ఆసుపత్రికి వచ్చే పరిస్థితి లేకుండా టెలీ మెడిసిన్, ఆన్‌లైన్ వైద్య సేవలకు ప్రాధాన్యమిచ్చేలా సూచిస్తున్నాం. జిల్లాలోని చాలా మంది వైద్యులు కొవిడ్ మొదటి దశ నుంచి ఆన్‌లైన్ వైద్యం వైపు అడుగులు వేస్తున్నారు. గర్భిణులు వైద్యుని సలహా లేకుండా సాధారణ మందులు వినియోగించ కూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సివస్తే ప్రయాణంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. - డాక్టర్ పద్మజ, ప్రసూతి వైద్యనిపుణురాలు, రాజమహేంద్రవరం గైనకాలజికల్ సొసైటీ అధ్యక్షురాలు
గత పరీక్షల వివరాలు తెలుసుకుని..
ఆన్‌లైన్‌లో వీలైనంత వరకు కుటుంబ వైద్యుడినే సంప్రదించాలి. వారి ఆరోగ్యంపై కొంత అవగాహన ఉంటుంది. కొత్తగా ఆన్‌లైన్‌లో సంప్రదించినప్పుడు పాత మందులు, పరీక్షల రిపోర్టులు ఆన్‌లైన్‌లో తెప్పించుకుంటున్నాం. కొవిడ్ సోకిన వారికి ఊపిరితిత్తులపై అధిక ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తుల వైద్యుడిని సంప్రదిస్తే దగ్గు, జలుబు, జ్వరం, శరీర నొప్పులు.. ఇలా ఏ లక్షణం ముందు వచ్చిందో వివరిస్తే వారు తీవ్రత గుర్తించి చికిత్స చేస్తారు. -డాక్టర్ అనుసూరి పద్మలత, ఊపిరితిత్తుల వైద్యనిపుణురాలు
ఇబ్బంది లేకుంటే రానవసరం లేదు..
సాధారణ పరీక్షలకు కొవిడ్ నేపథ్యంలో హృద్రోగులు ఆసుపత్రికి రాకపోవడం ఉత్తమం. గుండె శస్త్రచికిత్సలు జరిగి ఆయాసం, ఛాతిలో నొప్పి తదితర సమస్యలొస్తే కచ్చితంగా ఆసుపత్రిలో సంప్రదించాలి. హృద్రోగులకు కొవిడ్ సోకితే మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిత్యం తమ వైద్యుడితో మాట్లాడుతుండాలి. కొవిడ్ సోకిన హృద్రోగులు రోజుకు పది మందిచొప్పున ఫోన్‌లో సంప్రదిస్తే సూచనలు, సలహాలు ఇస్తున్నాం. - డాక్టర్ రామరాజు, గుండె వైద్య నిపుణులు, ఐఎంఏ రాజమహేంద్రవరం కార్యదర్శి
ఇదీ చదవండి: