వరదల వల్ల కౌలు రైతుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. పంటంతా నీళ్లలో మునిగిపోయి తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులు.. భూ యజమానులకు(landowners) కౌలు ఇవ్వక తప్పక పరిస్థితి. దాంతో కౌలు రైతులు.. భూ యజమానులకు ఒక విన్నపం చేస్తున్నారు. వచ్చే పంటలో సగం కౌలు ఇస్తామని, మిగతా సగం ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని జమ చేసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు ఓ తీర్మానం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలంలో సుమారు నాలుగు వేల ఎకరాలను 15వందల మంది కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. తుపానులు, భారీ వర్షాల ప్రభావంతో చేతికొచ్చిన పంట చేనులోనే కుళ్ళిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. కానీ.. భూ యజమానికి చెల్లించవలసిన కౌలు ఎకరాకు 10 బస్తాలు చొప్పున చెల్లించక తప్పనిపరిస్థితి. అయితే.. ప్రస్తుత పంటలో ఒక్క బస్తాకూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల పై విధంగా తీర్మానం చేశారు.
గత పదేళ్లుగా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, దీపావళి అమావాస్య నుండి ఇప్పటి వరకు ఏకదాటిగా వర్షం పడుతూనే ఉందని, పంటచేలు మొత్తం కుళ్లిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: BJP Leader Vishnu on Cyclone damage : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి - భాజపా