రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నాయకుల్ని అర్ధరాత్రి సమయంలో గృహ నిర్బంధం చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పోలవరం పర్యటనకు అనుమతి లేదంటూ అర్ధరాత్రి నుంచి సీపీఐ నాయకులను పోలీసులు గృహ నిర్బంధాలు చేస్తున్నారు.
నేడు పోలవరం యాత్రకు సీపీఐ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా యాత్రకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. రాజమండ్రిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను హోటల్ గదిలోనే నిర్బంధించారు. పోలీసుల తీరుపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం పరిశీలనకు వెళ్తున్నట్లు ఈ నెల19వ తేదీనే జలవనరుల శాఖ మంత్రికి సమాచారం ఇచ్చామని.. తాము ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. సమాచారమిచ్చినా ఈరోజు పోలీసులు హడావిడిగా నిర్బంధాలు చేయడమేంటని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని తాము చూడకూడదా అని నిలదీశారు. పోలవరం విషయంలో ప్రభుత్వం ఎందుకు భయపడుతోందన్నారు.
మేము పోలవరం సందర్శనకు వెళ్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రికి ముందుగానే సమాచారమిచ్చాం. పోలవరం అధికారులు మా పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు పోలీసులు హడావిడిగా మా నాయకులను నిర్బంధం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. పోలీసు రాజ్యం నడుస్తోందా అనేది నాకర్థం కావడంలేదు. పోలవరం విషయంలో ప్రభుత్వం ఇంతగా ఎందుకు భయపడుతోంది. -- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి..