తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో తొలి కరోనా మరణం నమోదయ్యింది. అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి వైరస్ బారిన పడి మరణించాడు. విజయవాడ నుంచి రెండు రోజుల కిందట అమలాపురం చేరుకున్న బాధితునికి శ్వాస ఇబ్బంది తలెత్తటంతో అమలాపురంలోని కిమ్స్ కొవిడ్ ఆస్పత్రికి తరిలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. చనిపోయిన వ్యకికి సంబంధించి ట్రూ నాట్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ వచ్చిందని అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులకు ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ తీసి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఆర్డీవో హెచ్చరికలు
కోనసీమలో తొలి కరోనా మరణం సంభవించటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో భవానీ శంకర్ హెచ్చరించారు. మాస్కులు లేకుండా ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.