తూర్పుగోదావరి జిల్లాలో రోజు రోజుకి రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం జిల్లాకు సమీపంలోని కేంద్రపాలిత యానాంపై పడుతోంది. కరోనా ప్రభావం ప్రారంభమైన నాటి నుంచి మూడు నెలల వరకు ఒక కేసు నమోదు కాని ఈ ప్రాంతంలో… మే నెలాఖరులో ఒకటి రెండు కేసులు మాత్రమే వెలుగు చూశాయి. జూన్ మొదటి వారంలో 10 కేసులు.. మధ్యలో 2..3.. జులై మొదటి వారంలో మరో పది కేసులు నమోదై… మొత్తం 35కు చేరాయి.
అధికారుల పర్యవేక్షణ లోపం
యానాం సమీపంలోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో ఉన్న రొయ్యల శుద్ధి పరిశ్రమల్లో పనిచేసే ఒక మహిళ ద్వారా సుమారు 15 మంది వరకు కరోనా బారిన పడ్డారు. అనుమానిత మహిళ నుంచి నమూనాలు సేకరించినా.. గృహ నిర్బంధం చేయకపోవడం.. ఆమె కదలికలను గుర్తించకపోవడంతో ఆమెను కలిసిన 15 మందికి ఈ వ్యాధి సోకింది.
ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళను ప్రభుత్వ క్వారెంటైన్ లో ఉన్న వారితో కలిపి ఉంచారు. ఆమె నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా ఫలితాలు రావడానికి వారం సమయం పట్టింది. పాజిటివ్ అని తేలడంతో మిగతావారంతా ఆందోళనకు గురవుతున్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అదేవిధంగా మరో గ్రామంలో హోమ్ క్వారెంటైన్ లో ఉన్న నలుగురు యువకుల నుంచి నమూనాలు సేకరించి పరిశీలనకు పంపించారు. వారు యథావిథిగా స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఆ నలుగురికి ఫలితాలు పాజిటివ్ రావడంతో గ్రామస్తులంతా అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి దగ్గర ఉన్న కాలనీలో ఐదుగురు... పోలీస్ శాఖలో ఒక కానిస్టేబుల్.. ఒక హోంగార్డు కరోనా బారిన పడ్డారు.
అదనపు సిబ్బంది నియామకం
8 రెవెన్యూ డివిజన్లుగా ఉన్న యానాంను 16 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్ పరిధిలోని 100 గృహాలకు వివిధ ప్రభుత్వ శాఖల్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఉద్యోగులను పర్యవేక్షకులుగా నియమించారు. వారి ద్వారా... హోమ్ క్వారెంటైన్ లో ఉన్న వారిపై మరింత నిఘా పెంచారు. ఇంతకాలం కరోనా అనుమానితులు, బాధితుల కదలికలను ఆశా వర్కర్లు.. ఉదయం సాయంత్రం సంబంధిత సెక్టార్ డాక్టర్లు చూసేవారు. కరోనా వ్యాప్తి తీవ్రం అవడం.. బాధితుల్లో నిర్లక్ష్యం పెరగడం వంటి పరిణామాలతో.. డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా ఈ చర్యలు చేపట్టారు.
ఆరోగ్య శాఖ నివేదిక
70 వేల జనాభా కలిగిన యానాంలో ఇప్పటివరకు అనుమానిత లక్షణాలున్న 1300 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1176 మందికి నెగటివ్ వచ్చింది. మరో 107 ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వాసుపత్రిలో 50 పడకలు.. డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉన్నారని.. 11 మంది చికిత్స అనంతరం కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారని.. ప్రజలు భయపడాల్సిన పరిస్థితి లేదని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలని... రానున్న రోజుల్లో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.