Kakinada Mada Adavulu: అక్రమమని తెలిసీ అడ్డదారి తొక్కడం అంటే తెగించడమే.! అదే పని మళ్లీ మళ్లీ చేయడం అంటే..బరితెగించడమే.! కాకినాడలో ఇప్పుడదే జరుగుతోంది. మడ అడవులను మడతేసే కుట్రకు మరోసారి తెర లేచింది. గతంలో ఇళ్ల స్థలాల కోసం మడ అడవుల్ని నరికేసినందుకు హరిత ట్రైబ్యునల్ చివాట్లు పెట్టి జరిమానా విధించినా మళ్లీ అదే ప్రాంతాన్ని చదును చేస్తున్నారు.
కాకినాడ నగర శివారు దుమ్ములపేట సమీపంలో మడ అడవులున్నాయి. ఇది తీర ప్రాంత పరిధి. ఇక్కడ 90 ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం గతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేసింది. పర్యావరణ వేత్తల అభ్యంతరాలు లెక్క చేయకుండా అధికారులు 58 ఎకరాల్లో మడ అడవులు ధ్వంసం చేశారు. మెరక పనులు చేపట్టి లేఅవుట్ వేశారు. జగన్ చేతుల మీదుగా ఈ స్థలాలు పంపిణీ చేయాలని భారీ పైలాన్ కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. ఐతే న్యాయ చిక్కులు ఎదురవడంతో జగనన్న లేఔట్‌ను యు.కొత్తపల్లి మండలంలోని కొమరగిరికి మార్చారు. కానీ దుమ్ములపేట సమీపంలో మడ అనవాళ్లే లేవని, ఇది అటవీ ప్రాంతమే కాదని కీలక శాఖలు అప్పట్లో తప్పుదోవ పట్టించాయి. కానీ అక్కడ పర్యావరణ విధ్వంసం జరిగిందని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ తర్వాత అక్కడ ఇళ్ల స్థలాలకు ఎంపిక చేసింది. మడ అడవులన్న ప్రాంతమేనని ఎన్టీటీ నిర్ధారించింది. మడ అడవులు ధ్వంసం చేసినందుకు మధ్యంతర పరిహారం కింద 5 కోట్లు చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని గతేడాది నవంబర్‌లో ఆదేశించింది. ఆ నిధులు మడ అడవుల పెంపకం సంరక్షణకు వినియోగించాలని ఆదేశించింది.
ఎన్టీటీ ఆదేశాల మేరకు మడ వనాలున్న ప్రాంతంలో కనీస రక్షణ చర్యలు చేపట్టలేదు సరికదా నిర్దేశిత ప్రాంతాన్ని కొట్టేసే మరో కుట్రకు తెరలేచింది. లారీ యూనియన్‌లోని కొందరు వైఎస్సార్సీపీ నాయకులు ఈ భూమిపై కన్నేశారు. గత రెండు రోజులుగా భారీ వాహనాలతో మట్టి పోయించి లారీలు నిలిపేందుకు అనువైన ప్రాంగణంగా దాన్ని మార్చేశారు. వాహనాల రాకపోకలకు వీలుగా గుంతల్నీ పూడ్చారు. కొత్తగా మొలకెత్తుతున్న మొక్కలపై మట్టిపోసి చదును చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులే దీనికి బరితెగించారనే విమర్శలున్నాయి. పనులు అడ్డుకునేందుకెళ్లిన అటవీశాఖ సిబ్బందిని బెదిరించారనే ఆరోపణలున్నాయి.
ఇంత బహిరంగంగా ఇక్కడ మడ అడవుల విధ్వంసం సాగుతుంటే ఎవరూ అడ్డుకున్నావారేలేరు. అటవీశాఖ అధికారుల ఫిర్యాదుతో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, అర్బన్ తహసీల్దారు ఇతర అధికారులు నిర్దేశిత ప్రాంతాన్ని పరిశీలించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఈ స్థలం న్యాయస్థానం స్టేటస్‌కో పరిధిలో ఉందని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు.
అక్రమార్కుల బెదిరింపులకు భయపడకుండా ఫ్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో మడ అడవులు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి