తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని కొత్తపాకల వద్ద దివిస్ ఫార్మా పరిశ్రమ ఆస్తులు తగలబెట్టిన ఘటనలో 160 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. దివిస్ సంస్థ యాజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.
ఇదీ జరిగింది
దివిస్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల 2 నుంచి రిలే దీక్షలు చేస్తున్న వామపక్షాలు, దివిస్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు ఈ నెల 17న ఇదే ప్రాంగణంలో బహిరంగ సభకు సన్నాహాలు చేశారు. ఈక్రమంలో నిరసనకారులు దివిస్ ప్రాంగణం వైపు నినాదాలు చేస్తూ దూసుకెళ్లారు. వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని దాటుకొని కొందరు లోపలకు చొరబడ్డారు. అక్కడ ఉన్న వాహనాల అద్దాలు పగలగొడుతూ.. జనరేటర్, ఇతర సామగ్రికి నిప్పు పెట్టారు. కంచెను, గోడను కూడా రెండు, మూడు చోట్ల ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పటంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. కొంతమందిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులకు కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
సీఎం ఆరా
దివిస్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నేడు దివిస్ ప్రాంగణంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.