తూర్పుగోదావరి జిల్లాలో కాలువలు పక్కన రోడ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. ప్రత్యేక రక్షణ చర్యలు లేకపోవటంతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాలువల్లోకి వాహనాలు దూసుకుపోతున్నాయి.
రాజవరం-పొదలాడ స్టేట్ హై వే గంటి నుంచి పొదలాడ వరకు అత్యంత ప్రమాదకరంగా ఉంది. రెండున్నర దశాబ్దాల్లో ఈ దారిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 150 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా ప్రమాదాలు అమలాపురం-బొబ్బర్లంక, కొత్తపేట-ముక్తేశ్వరం, సిరిపల్లి-ముక్తేశ్వరం, పొదలాడ-సఖినేటిపల్లి రహదారుల్లో అనేకం చోటు చేసుకున్నాయి.
30 అడుగుల లోతులోకే..
తాళ్లరేవు మండలం గోవలంక నుంచి పిల్లంక వరకు ఏటిగట్టు రహదారి రెండు కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ఇరువైపులా 30 అడుగుల లోతు కలిగి ఉంది. ఆరు అడుగుల వెడల్పు కలిగిన ఈ మార్గంలో ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప క్షేమంగా గమ్యానికి చేరుకోలేరు. ఏటిగట్టు రోడ్డును వెడల్పు చేయాలి.
రక్షణ చర్యలు ఎప్పటికో?
ఆత్రేయపురం మండలంలోని అమలాపురం-బొబ్బర్లంక ర.భ రోడ్డులో బ్యాంక్ కెనాల్ లాకుల వద్ద మలుపులో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల నాలుగు వాహనాలు ఇక్కడ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లాయి. కూడలి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి.
భద్రమండోయ్..
పామర్రు మండలం జొన్నాడ నుంచి యానాం వరకు సుమారు 49 కిలోమీటర్ల దారి ఇరుకుగా ఉండి ప్రమాదకరంగా మారింది. జొన్నాడ నుంచి జాతీయ రహదారికి కలిసేచోట, కపిలేశ్వరపురం, శ్రీరామపురం, కూళ్ల లాకులు, కూళ్ల నుంచి వంతెన మీదుగా ఏటిగట్టు ఎక్కే కూడలి, మల్లవరం, కోట, రాజవైరి అక్విడక్ట్ కమ్ అవుట్ ఫాల్ స్లూయిస్ వద్ద మలుపులు, పిల్లంక, గోవలంక వద్ద ఇరుగ్గా ఉన్నచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మలుపులకు ఇరువైపులా గడ్డిమొక్కలు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించట్లేదు.
సూచికలు ఉండాలి
- కల్వర్టుల వద్ద హజార్డ్ మార్కర్లను ఎరుపు, తెలుపురంగుల్లో వేయాలి.
- మలుపులు, స్కూలు జోన్లలో త్రిభుజాకార సూచికలు ఉండాలి.
- ప్రతి కూడలికి 50 మీటర్ల ముందే ఇరువైపులా జీబ్రా క్రాసింగ్స్ వేయాలి.
- అంచులు కోతకు గురైన చోట కేట్‌ఐలు, రేడియం సిగ్నల్స్ వేయాలి.
- కాలువల వెంట దారులకు ఇనుపతీగతో రోప్, ఇనుపప్లేట్లు వేస్తే రక్షణ వలయంగా నిలుస్తాయి.
రక్షణ చర్యలు చేపడతాం
రహదారుల మలుపులు, ఇతర ప్రమాదకర ప్రదేశాల వద్ద రక్షణ చర్యలు చేపడతాం. పలుచోట్ల ప్రమాదాల ప్రదేశాలు తెలిసేలా ప్రమాద సూచికలు ఏర్పాటు చేశాం. రోడ్ల వెంట ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. మార్జిన్లు కోతకు గురైన ప్రదేశాల వద్ద రక్షణ ఏర్పాట్లు చేస్తాం. - సీహెచ్.సత్యవేణు,డీఈఈ, ర.భ.శాఖ, కొత్తపేట
ఇదీ చదవండి: లోక్సభలో వైకాపా తీరు.. రైతు ద్రోహమే: చంద్రబాబు